హాల్‌ టికెట్‌ ఇవ్వలేదని.. | - | Sakshi
Sakshi News home page

హాల్‌ టికెట్‌ ఇవ్వలేదని..

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

ఫీజు కోసం వేధించిన కళాశాల సిబ్బంది

అదనంగా డబ్బు డిమాండ్‌

హయత్‌నగర్‌: ప్రైవేటు కళాశాల ఫీజు దాహానికి ఓ బీటెక్‌ విద్యార్థి బలయ్యాడు. హాల్‌ టికెట్‌ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లికి చెందిన రమేష్‌ ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ హయత్‌నగర్‌లోని రాఘవేంద్రనగర్‌ కాలనీలో నివాసముంటున్నాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు ప్రణీత్‌ (21) ఇబ్రహీపట్నం మండలం శేరిగూడలోని శ్రీ ఇందూ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు ఉండడంతో ఈ నెల 17న హాల్‌ టికెట్‌ కోసం కళాశాలకు వెళ్లి ఏఓ కృష్ణమూర్తిని కలిశాడు. ఇంకా ఫీజు చెల్లించలేదు.. అంతేకాక అటెండెన్స్‌ తక్కువగా ఉంది.. ఫీజుతోపాటు మరో రూ.5 వేలు ఇస్తేగానీ హాల్‌ టికెట్‌ ఇవ్వనని తోటి విద్యార్థుల ముందే చెప్పాడు. ప్రమాదం కారణంగా కళాశాలకు రాలేకపోయానని.. తన పరిస్థితిని అర్థం చేసుకోవాలంటూ ఆధారాలు చూపినా హాల్‌ టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించాడు. ప్రణీత్‌ తండ్రి కూడా తాను సిటీలో లేనని. సోమవారం వచ్చి కలుస్తానని చెప్పాడు. అయినా హాల్‌ టికెట్‌ ఇవ్వకపోడంతో మనస్తాపానికి గురైన ప్రణీత్‌ శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రణీత్‌ తండ్రి రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహంతో కళాశాల ఎదుట ఆందోళన

ఇబ్రహీంపట్నం: ఫీజు చెల్లించాలని వేధించడంతో బలవన్మరణానికి పాల్పడ్డ ప్రణిత్‌ మృతదేహంతో శేరిగూడ సమీపంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్‌ కళాశాల ఎదుట విద్యార్థి సంఘల నేతలు ఆదివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. యాజమాన్యం వేధింపుల కారణంగా మనస్తాపంతో ప్రణీత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఈ సందర్భంగా కళాశాల గేట్‌ను ధ్వంసం చేసి లోనికి వెళ్లేందుకు యత్నించారు. కళాశాల చైర్మన్‌ రావాలని డిమాండ్‌ చేశారు. ఏసీపీ కేవీపీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డి ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పలువురిని అరెస్టు చేశారు. అనంతరం మృతదేహన్ని బంధువులకు అప్పగించారు. ఆందోళనలో ఎస్‌ఎఫ్‌ఐ, జాగృతి, మాల మహానాడు నేతలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement