బస్సును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో.. | - | Sakshi
Sakshi News home page

బస్సును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో..

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

బొలేరో, బైక్‌ ఎదురెదురుగా ఢీ

తీవ్రంగా గాయపడిన ద్విచక్రవాహనదారులు

కుల్కచర్ల: బస్సు ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని పీరంపల్లి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ పరమేశ్‌, స్థానికులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పటేల్‌ చెరువు తండాకు చెందిన గోపాల్‌ నాయక్‌, మోహన్‌ నాయక్‌ ద్విచక్రవాహనంపై కుల్కచర్ల నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. మహ్మదాబాద్‌ నుంచి పరిగికి వెళ్తున్న బొలేరో వాహనం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్‌టెక్‌ చేసే క్రమంలో బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వారిని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదని వాహనాలను ఠాణాకు తరలిస్తున్నామని చెప్పారు.

440 మంది ‘నిషా’చరులకు చెక్‌

సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు వీకెండ్స్‌తో ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగిస్తున్నారు. గత వారాంతమైన శుక్ర, శనివారాల్లో నగర వ్యాప్తంగా చేపట్టగా... 440 మంది డ్రంక్‌ డ్రైవింగ్‌ చేస్తూ అధికారులకు పట్టుబడ్డారని ట్రాఫిక్‌ చీఫ్‌ డి.జోయల్‌ డెవిస్‌ ఆదివారం వెల్లడించారు. సమయం, ప్రాంతం, సందర్భాలతో సంబంధం లేకుండా ఆకస్మికంగా డ్రంక్‌ డ్రైవింగ్‌ తనిఖీలు చేశారు. పట్టుబడిన 440 మందిలో 376 మంది ద్విచక్ర, 21 మంది త్రిచక్ర, 43 మంది తేలికపాటి వాహనాల చోదకుల అని ట్రాఫిక్‌ చీఫ్‌ పేర్కొన్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాముల ఆల్కహాల్‌ ఉండే అది ఉల్లంఘన. దీన్ని సాంకేతికంగా బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌ (బీఏసీ) అంటారు. శుక్ర, శనివారాల్లో చిక్కిన వారిలో 91 మందికి 30–50 మధ్య, 200 మందికి 51–100 మధ్య, 79 మందికి 101–150 మధ్య, 31 మందికి 151–200 మధ్య, 18 మందికి 201–250 మధ్య, 12 251–300 మధ్య, తొమ్మిది 300 పైగా వచ్చినట్లు జోయల్‌ డెవిస్‌ చెప్పారు. నగర వ్యాప్తంగా ఈ స్పెషల్‌ డ్రైవ్‌లు కొనసాగిస్తామన్నారు. వీటిలో చిక్కిన వారికి కౌన్సిలింగ్‌ నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు.

‘మహిళా రిజర్వేషన్‌’ వెనుక కేంద్రం కుట్ర

బన్సీలాల్‌పేట్‌: మహిళా రిజర్వేషన్ల అంశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని సికింద్రాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు దీపక్‌ జాన్‌ ఆరోపించారు. పద్మారావునగర్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును డీలిమిటేషన్‌(నియోజకవర్గాల పునర్వీభజన) ప్రక్రియతో ముడిపెట్టడాన్ని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వివరించారు. 543 పార్లమెంట్‌ స్ధానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలా చేస్తే తమ కూటమి పూర్తి స్ధాయిలో మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌ స్ధానాల సంఖ్యను పెంచిన తర్వాతే రిజర్వేషన్లు అమలు చేస్తామనడం మహిళలను మోసం చేయడమేనన్నారు. సమావేశంలో సికింద్రాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు వీఎస్‌ నారాయణ, శ్రీనివాస్‌లతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement