‘కండల ఇంజెక్షన్ల’ పట్టివేత!
మందుల చీటీ లేకుండా ‘మెఫెంటర్మైన్ సల్ఫేట్’విక్రయం గుట్టురట్టు చేసిన వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు ఫైజల్‌ఖాన్ అరెస్టు..133 ఇంజెక్షన్ల స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: అత్యవసర వైద్య సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్‌గా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ సోమవారం వివరాలు వెల్లడించారు. కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ ఖాన్ ఫర్మిచర్ దుకాణంలో పనిచేస్తుంటాడు. జిమ్‌కు వెళ్లే అలవాటు ఉన్న ఫైజల్ అక్కడ కొందరు యువకులు మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను స్టెరాయిడ్స్‌గా వాడుతున్నట్లు తెలుసుకున్నాడు. ఇదే అదనుగా తేలిగ్గా డబ్బు సంపాదించడానికి వీటిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇండియా మార్ట్ యాప్ ద్వారా సూరత్ నుంచి ఈ ఇంజెక్షన్లు ఒక్కోటి రూ.150కి ఖరీదు చేసి జిమ్‌కు వచ్చే యువతకు రూ.600 నుంచి రూ.700కు విక్రయిస్తున్నాడు. యువత నిర్ణీత బరువు కంటే ఎక్కువ బరువులు ఎత్తడానికి, కండలు పెంచుకోవడానికి, ఎక్కువ సమయం వ్యాయామం చేయడానికి స్టెరాయిడ్‌గా ఈ ఇంజెక్షన్ వాడుతున్నారు.
ఆరోగ్యపరంగా అనేక దుష్పరిణామాలు..
ఫైజల్ వ్యవహారంపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ యదేందర్, ఎస్సై మహ్మద్ జాహెద్ తమ బృందాలతో వలపన్ని అత్తాపూర్‌లోని ఏసియన్ థియేటర్ వద్ద పట్టుకున్నారు. అతడి వద్దనున్న 133 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఇంజెక్షన్లను కొన్నాళ్లు ఫైజల్ కూడా వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనల ప్రకారం వీటిని కేవలం మెడికల్ షాపుల్లో, వైద్యుడి చీటీ ఆధారంగానే విక్రయించాలి. వీటిని సుదీర్ఘకాలం వాడితే రక్తపోటు, గుండె సమస్యలతోపాటు మానసిక ఇబ్బందులు వస్తాయని అదనపు డీసీపీ హెచ్చరించారు. వీటి విక్రయంపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు అందించాలని ఆయన కోరారు.


