ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి భద్రత
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయిలో భద్రత కల్పిస్తాం అని పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు పేర్కొన్నారు. పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో సోమ వారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు కవాతుతో ఆయనకు వందనం సమర్పించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వారికి ఆయన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని ప్రజలతో మమేకమై శాంతిభద్రతలను కాపాడాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. చట్టం నుంచి రక్షణ కోరే వారిని కాపాడుతూ.. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడే వారిని శిక్షించేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. నేరాలకు పాల్పడే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కమిషనరేట్ కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని, త్వరలో భవన నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో అదనపు సీపీ చందనాదీప్తి, డీసీపీలు నారాయణరెడ్డి, యేగేష్, శిరీష, ఏసీపీలు జానకీరెడ్డి, రాజు, చంద్రశేఖర్, కిషన్, లక్ష్మీనారాయణ, సీఐలు పాల్గొన్నారు.


