
ఎన్నికల నిర్వహణకు సిద్ధంకండి
అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి
ఇబ్రహీంపట్నం: బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మంగళవారం సందర్శించారు. పలు కీలక అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఓటర్ల తుది జాబితా, ఫార్మాసిటీ భూములు, సర్వేయర్ల సమస్య, భూభారతిలో వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో చోటుచేసుకున్న అసైన్డ్ భూముల వ్యవహారంపై ఆరా తీశారు. సమావేశంలో ఆర్డీవో అనంతరెడ్డితో పాటు తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.