● ఆదర్శ ఇంటర్ విద్యార్థులకు జాతీయస్థాయి శిక్షణ ● ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 4 పాఠశాలలు ఎంపిక
పెగడపల్లి: ఆదర్శ మోడల్ స్కూల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్, ఐఐటీ, జేఈఈ, క్లాట్ వంటి ప్రవేశాలకు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జిల్లాకు ఒక్కటి చొప్పున నాలుగింటిని యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పాఠశాలలుగా ఎంపిక చేశారు. జగిత్యాల నుంచి మేడిపల్లి పాఠశాలను కామన్ లా అడ్మిషన్ టెస్టు(క్లాట్)కు ఎంపిక చేయగా.. రాజన్న సిరిసిల్ల నుంచి మండెపల్లి, పెద్దపల్లి జిల్లా నుంచి జూలపల్లి మండలం పెద్దపూర్, కరీంనగర్ జిల్లా నుంచి గంగాధర మండలం కొండాయపల్లి పాఠశాలలను జేఈఈ, నీట్ ఐఐటీ శిక్షణ కోసం ఎంపిక చేశారు. ఇంటర్ చదువుతున్న సుమారు 160 మంది విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో కార్పొరేట్ స్థాయిలో ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యనందిస్తున్న ఆదర్శ పాఠశాలలు మరింత బలపేతం కానున్నాయి. మోడల్ స్కూళ్లలో 6 నుంచి ఇంటర్ వరకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. విద్యార్థులు నీట్, జేఈఈ, ఐఐటీ, క్లాట్ వంటి పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఆసక్తి చూపుతున్నా.. అందుకుదగ్గ బోధన లేక ఇక్కడి విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో రాణించలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జాతీయస్థాయి పరీక్షల్లో విద్యార్థులు రాణించేలా నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపిక చేసిన ఒక్కో పాఠశాల నుంచి 160 మంది విద్యార్థులు ఈ శిక్షణ పొందనున్నారు. ఇందుకుగానూ జేఈఈ, నీట్, ఐఐటీ శిక్షణ కోసం విద్యార్థులకు కావాల్సిన స్టడీ మెటీరియల్ కోసం రూ.1,92,000, అతిథి అధ్యాపకుల వేతనాల కోసం రూ.11,85,000 చొప్పున మొత్తం రూ.13,77,600 ఒక్కో పాఠశాలకు నిధులు మంజూరు చేశారు. క్లాట్‌కు ఎంపిక చేసిన మేడిపల్లి పాఠశాలకు అధ్యాపకుల వేతనం రూ.9,88,000, స్టడీ మెటీరియల్‌కు రూ.96,000 కేటాయించారు. ప్రత్యేక తరగతుల బోధన కోసం ఆరుగురు అతిథి అధ్యాపకులను నియమించనున్నారు. 152 రోజులపాటు నిత్యం 2 గంటలు బోధన చేస్తారు. పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను ప్రభుత్వం సమకూర్చనుంది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆదర్శ పాఠశాలలకు విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు.
జాతీయస్థాయిలో రాణిస్తారు
ఇప్పటి వరకు కార్పొరేట్ కాలేజీల విద్యార్థులే నీట్, జేఈఈల్లో సీట్లు కొడుతున్నారు. ఆర్థికంగా వెనకబడిన మా విద్యార్థుల్లో ప్రతిభ ఉంది. వారికి సరైన గైడెన్స్, కోచింగ్ ఇస్తే జాతీయస్థాయిలో రాణిస్తారు. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపికై న పాఠశాలలకు నిపుణులైన అధ్యాపకులను నియమిస్తాం.
– రామ్, జిల్లా విద్యాధికారి
ఎంపికై న పాఠశాలలు
జగిత్యాల: మేడిపల్లి
రాజన్న సిరిసిల్ల: మండెపల్లి
పెద్దపల్లి: జూలపల్లి మండలం పెద్దాపూర్
కరీంనగర్: గంగాధర మండలం కొండాయపల్లి


