ఓవర్‌ లోడ్‌..స్పీడ్‌ | - | Sakshi
Sakshi News home page

ఓవర్‌ లోడ్‌..స్పీడ్‌

Oct 30 2026 12:03 AM | Updated on Oct 30 2026 12:03 AM

గ్రానైట్‌ లారీల రాకపోకలతో భయం గంగాధర–కొదురుపాక–బావుపేట బండల బరువుకు బీటీ రోడ్లు ఛిద్రం దుమ్ము ధూళితో ప్రజల అవస్థలు ఆర్టీఏ తనిఖీలు శూన్యం.. రోడ్డు సేఫ్టీ వైఫల్యం

బోయినపల్లి(చొప్పదండి): అతి వేగం.. ఓవర్‌ లోడ్‌తో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. గ్రానైట్‌ బండలతో వస్తున్న లారీలను చూస్తేనే మండల ప్రజలు భయంతో పక్కకు తప్పుకుంటున్నారు. లారీల అతివేగానికి దుమ్ము లేచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డును ఆనుకుని ఉన్న దుకాణదారులు నిత్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు పూటల షాపుల ముందు దుమ్ము లేవకుండా నీళ్లు పట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

పెద్ద..పెద్ద బండలు

గంగాధర మండలంలోని పలు గ్రానైట్‌ క్వారీల నుంచి నుంచి బోయినపల్లి, కొదురుపాక గ్రామాల మీదుగా బావుపేట గ్రానైట్‌ ఫ్యాక్టరీలకు నిత్యం పెద్ద మొత్తంలో గ్రానైట్‌ బండలారీలు వెళ్తుంటాయి. నర్సింగాపూర్‌ క్వారీల నుంచి సైతం పెద్ద స్లాబ్‌లను కరీంనగర్‌, బావుపేటలకు తరలిస్తారు. గతంలో కొదురుపాక నుంచి బోయినపల్లి వస్తున్న ఓ గ్రానైట్‌ లారీ బోయినపల్లి పెట్రోల్‌బంక్‌ సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తాపడింది. అదృష్టవశాత్తు డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. మరోసారి కొదురుపాక వద్ద ఓ గ్రానైట్‌ బండ లారీ ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. నర్సింగాపూర్‌, వెంకట్రావుపల్లి రోడ్లపై గతంలో హెవీ లోడ్‌తో ఉన్న లారీలు దిగబడి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. గంగాధర నుంచి వచ్చే బండ లారీలు బోయినపల్లి బస్టాండ్‌ ప్రాంతంలో విపరీతమైన వేగంతో వెళ్తుండడంతో ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు.

గంగాధర– కొదురుపాక–బావుపేట

గంగాధర మండలంలోని పలు గ్రామాల నుంచి బోయినపల్లి మండలం కొదురుపాక, వెంకట్రావుపల్లి మీదుగా కొత్తపల్లి మండలం బావుపేట స్లాబ్‌ కటింగ్‌ ఫ్యాక్టరీలకు నిత్యం 15 నుంచి 20 వరకు లారీలలో స్లాబ్‌లు తరలుతున్నాయి. బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌ క్వారీల నుంచి సైతం గ్రానైట్‌ లారీలు హెవీలోడ్‌తో వెళ్తున్నాయి. బావుపేట ఫ్యాక్టరీల్లో బండరాళ్లతో స్లాబ్స్‌ కట్‌ చేస్తారు. గంగాధర నుంచి బోయినపల్లి, కొదురుపాక వరకు డబుల్‌ రోడ్డు ఉండడంతో పదుల సంఖ్యలో బండ లారీలు గంగాధర మండలం నుంచి బావుపేటకు వెళ్తుంటాయి. గంగాధర మండలం మీదుగా బోయినపల్లి మండలం కొదురుపాక మీదుగా వెళ్లే బండలారీలు అతివేగంగా వెళ్తుంటాయని ఆరోపణలు ఉన్నాయి. అధిక లోడ్‌ లారీలతో బోయినపల్లి, దేశాయిపల్లి వద్ద రోడ్లు, వంతెనలు పాడవుతున్నాయంటున్నారు. రోడ్లు పాడైతే మట్టి పోసి చేతులు దులుపుకుంటున్నారు.

బోయినపల్లిలో దుమ్ము లేవకుండా నీళ్లు పడుతున్న వ్యాపారి

దేశాయిపల్లి రోడ్డులో హెవీ లోడ్‌ గ్రానైట్‌ లారీ

ఆర్టీఏ తనిఖీలు శూన్యం.. జాడలేని రోడ్డు భద్రత

గంగాధర–కొదురుపాక డబుల్‌ రోడ్డుపై హెవీ లోడ్‌తో వెళ్లే బండ లారీల ఫిట్‌నెస్‌పై ఆర్టీఏ అధికారులు తనఖీలు మరిచారనే ఆరోపణలు ఉన్నాయి. లారీ ఫిట్‌నెస్‌ ఎలా ఉంది..? ఎన్ని టన్నుల్లో స్లాబ్స్‌ తీసుకెళ్లవచ్చు, ఆ లోడ్‌తో రోడ్డుకు ఏమి కాదా అనే అంశాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల లీజ్‌ అగ్రిమెంట్‌లు ముగిసినా యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారని, రాయల్టీ చెల్లించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లీజ్‌ అగ్రిమెంట్ల గురించి అధికారులను అడిగితే తెలియదని దాటవేస్తున్నారు. నర్సింగాపూర్‌, కొత్తపేట క్వారీల్లో అనుమతులకు మించి మైనింగ్‌ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గ్రానెట్‌ వ్యాపారులు తమ వాహనాలకు ఇబ్బంది కలుగకుండా చూసుకుంటున్నారని వినిపిస్తోంది. గ్రానైట్‌ లారీల వేగానికి కళ్లెం వేసి, రోడ్డు భద్రత చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement