యూనిఫాం బాధ్యతను పెంచుతుంది
ఎస్పీ మహేశ్ బీ గీతే
చందుర్తి: ప్రాణాలను ఫణంగా పెట్టి సంఘ విద్రోహశక్తులతో పోరాటం చేసిన అమరులైనా పోలీసుల త్యాగం చిరస్మరణీయమని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. చందుర్తి మండలం లింగంపేట శివారులోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించిన పోలీసు సంస్మరణ సభకు ఎస్పీ మహేశ్ బీ గీతే, డీఎస్పీ కె.నాగేంద్రచారి, ఎ.శ్రీనివాసులు, ఎస్బీ డీఎస్పీ గాండ్ల వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ముందుగా పోలీసుల అమరవీరుల స్తూపం వద్ద ఎస్పీ మహేశ్ బీ గీతే, డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ శాంతి సమాజ స్థాపన కోసం ఎందరో పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను పోగొట్టుకున్నారన్నారు. వారి త్యాగాలను మరవవద్దని పేర్కొన్నారు. నక్సల్స్ ప్రాబల్యంతో ఈ ప్రాంతం నలిగిపోయిందని, పోలీసుల త్యాగాలతోనే నేడు ప్రజలు సుఖసంతోషాల మధ్య గడుపుతున్నారన్నారు. యూనిఫాం బాధ్యతలను పెంచుతోందని గుర్తు చేశారు. కుటుంబ సభ్యులకు, బంధువులు దూరమై నిరంతరం విధి నిర్వహణలో ఉండేది ఒక్క పోలీసులేనని పేర్కొన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. సీఐలు రవీందర్, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్, శ్రీనివాస్, ఎస్సైలు జిల్లెళ్ల రమేశ్, సిరిసిల్ల అశోక్, ప్రశాంత్‌రెడ్డి, రామ్మోహన్, మోతిరామ్‌నాయక్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


