కరీంనగర్అర్బన్: ఎల్నినో నేపథ్యంలో రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్, సాగునీటి అవసరా లకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేకాధికారి బెనాహుర్ మహేశ్ దత్ ఎక్కా ఆదేశించారు. శనివా రం కరీంనగర్ కలెక్టరేట్లో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కలెక్టర్లు గరీమా అగ్రవాల్, చిత్రామిశ్రా, కోయ శ్రీహర్ష, బి.సత్యప్రసాద్తో సమీక్ష నిర్వహించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ఆదేశించారు. కోతుల సమస్యలు లేని ప్రాంతాల్లో కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాలువల ద్వారా ప్రస్తుత వానాకాలం పంటలు రక్షించేందుకు విడుదల చేసే నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా పర్యవేక్షించాలని, మధ్యలో మోటార్ల ద్వారా తోడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాబో యే రోజుల్లో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా లభ్యత పరిమితంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచి, ప్రజలు వలస వెళ్లాల్సిన పరిస్థితులు రాకుండా చూడాలన్నారు. మున్సిపాలిటీల్లో అమృత్ కింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలన్నారు. కరీంనగర్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 7 శాతం తక్కువగా 681.7 మి.మీ. నమోదైందని తెలిపారు. దిగువ మానేరు జలాశయంలో 15.452 టీఎంసీల నీరు ఉందని, నెలవారీ అవసరాలు 0.68 టీఎంసీల ప్రకారం సుమారు 512 నుంచి 593 రోజుల వరకు నీటి సరఫరాకు అవకాశం ఉందని వివరించారు. జగిత్యాల కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 9 శాతం తక్కువగా నమోదైందని, ఈనెల 10 నుంచి కాలువల ద్వారా ఎస్సారెస్పీ నీటి విడుదల ప్రారంభమైనందున ప్రస్తుత పంటలకు సాగునీటి ఇబ్బందులు లేవని తెలిపారు. పెద్దపల్లి కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 863 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణం కంటే 5 శాతం తక్కువగా ఉందని తెలిపారు. ఖరీఫ్లో డ్రై స్పెల్స్ నమోదు కాకపోవడంతో జిల్లాలో కరువు పరిస్థితులు లేవన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సాధారణం కంటే 5 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. మధ్య మానేరు జలాశయంలో 23.42 టీఎంసీలు, అప్పర్ మానేరులో 1.84, అన్నపూర్ణ జలాశయంలో 1.59, మల్కాపేట జలాశయంలో 1.24 టీఎంసీల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ మున్సి పల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు.


