సిరిసిల్ల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో శనివారం బతుకమ్మ వేడుకలను జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడలో శుక్రవారం ఘనంగా నిర్వహించామని, సిరిసిల్లలో ఆదివారం సద్దుల వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు. ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు బతుకమ్మ పాటలకు మహిళా అధికారులు, సిబ్బందితో కలిసి ఆడిపాడారు. మొదటి బహుమతి జిల్లా వ్యవసాయశాఖకు రాగా, రెండో బహుమతి రెవెన్యూ, మూడో బహుమతి ఎంపీపీఎస్ తంగళ్లపల్లికి వచ్చింది. విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేసి.. అభినందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, వేములవాడ ఆర్డీవో కే ఎస్బీ కుమారి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, వివిధ శాఖల జిల్లా అధికారులు అఫ్జల్బేగం, సౌజన్య, ఏంజెలా ఆల్ఫ్రెడ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.


