పూదోట.. ఉపాధిబాట సిరిసిల్ల అర్బన్/ముస్తాబాద్: ఉన్నత విద్యనభ్యసించిన యువకుడు ఉద్యోగం వచ్చే వరకు ఖాళీగా ఉండొద్దనే ఉద్దేశంతో పూలసాగుతో ఉపాధికి బాటలు వేసుకున్నాడు. పైలట్ శిక్షణ పూర్తి చేసిన యువకుడు ఉద్యోగాన్వేషణ చేస్తూనే ప్రకృతితో మమేకమై పూలతోటలు పెంచుతున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన గడ్డం సుమన్ ప్రతిష్టాత్మకమైన పైలట్ శిక్షణ తీసుకుని.. పూలు, పండ్ల తోటలు సాగుచేస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నాడు.
సీజనల్ పంటల సాగుపై దృష్టి
తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మార్కెట్లో డిమాండ్ ఉన్న ఉద్యానవన పంటల వైపు దృష్టి సారించాడు. సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఉన్న తన రెండెకరాల వ్యవసాయ భూమిలో బంతిపూలు, పట్టుకుచ్చుల పూలు సాగు చేస్తున్నాడు. సరైన సమయంలో నీటి యాజమాన్యం, ఎరువుల వినియోగంతో తోటలు కళకళలాడుతున్నాయి.
లాభాల బాటలో..
పండుగలు, శుభకార్యాలు, పూజల సమయంలో పూలకు ఉండే డిమాండ్‌ను ముందే అంచనా వేసిన సుమన్ అందుకు అనుగుణంగా పూలు సాగు చేశా డు. బతుకమ్మ, దసర, దీపావళి పండుగల తేదీలకు అనుగుణంగా పూల దిగుబడి వచ్చేలా సాగుచేశాడు. బంతిపూలు, పట్టుగుచ్చులతో తోటలు కళకళలాడుతున్నాయి. వీటిని చూసిన వ్యాపారులు సుమన్ తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
పైలట్ శిక్షణ తీసుకుని.. ప్రకృతి వ్యవసాయం చేస్తూ..
పూలసాగుతో ముందుకెళ్తున్న సుమన్
ఖాళీగా ఉండొద్దని రెండెకరాల్లో పూలసాగు
వరికి ప్రత్యామ్నాయంగా బంతిపూలు
ఎల్‌నినో ఎఫెక్టును తట్టుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. ఇందుకు నిదర్శనమే పూలసాగు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ముస్తాబాద్ మండలంలో పలువురు రైతులు బంతిపూలు సాగుచేసి ఆదాయం పొందుతున్నారు. బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండుగలకు బంతిపూలకు డిమాండ్ ఉన్న సంగతిని గ్రహించి మూడు నెలల క్రితమే పూల మొక్కలు నాటుకున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడు, కొండాపూర్, గూడూరు, వెంకట్రావుపల్లి, బందనకల్, ఆవునూర్ గ్రామాల్లో బంతి, చామంతి పూల తోటలు ఏపుగా పెరిగాయి. గూడూరులో రాజేందర్‌శర్మ, చీకోడులో రమేశ్, కొండాపూర్‌లో పూలసాగు చేపట్టారు. వినాయక చవితి నుంచి బంతి, చామంతి పూలకు డిమాండ్ వచ్చింది. తోటల్లో వెళ్తున్న పూలను సిరిసిల్ల, ముస్తాబాద్, కామారెడ్డి, సిద్దిపేట మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు.