డబ్బుల కోసమే హత్య | - | Sakshi
Sakshi News home page

డబ్బుల కోసమే హత్య

Oct 16 2026 10:34 AM | Updated on Oct 16 2026 10:34 AM

● 14 గంటల్లోనే హత్య కేసు ఛేదించిన పోలీసులు ● టైల్స్‌వర్క్‌ కాంట్రాక్టర్‌ పవన్‌సింగ్‌ హత్య కేసులో ఇద్దరి రిమాండ్‌ ● రామగుండం రైల్వేస్టేషన్‌లో అదుపులోకి.. ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగేంద్రచారి

● 14 గంటల్లోనే హత్య కేసు ఛేదించిన పోలీసులు ● టైల్స్‌వర్క్‌ కాంట్రాక్టర్‌ పవన్‌సింగ్‌ హత్య కేసులో ఇద్దరి రిమాండ్‌ ● రామగుండం రైల్వేస్టేషన్‌లో అదుపులోకి.. ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ నాగేంద్రచారి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలో సంచలనం సృష్టించిన టైల్స్‌వర్క్‌ కాంట్రాక్టర్‌ పవన్‌సింగ్‌ హత్య కేసును పోలీసులు 14 గంటల్లోనే ఛేదించారు. డబ్బుల కోసమే కాంట్రాక్టర్‌ను కూలీలు హత్యకు పాల్పడ్డట్లు తేలింది. సిరిసిల్ల డీఎస్పీ కత్తురోజు నాగేంద్రచారి వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన టైల్స్‌ కాంట్రాక్టర్‌ పవన్‌సింగ్‌(34) వద్ద కూలీలుగా వరుసకు బావమరిది అయిన రాజస్థాన్‌కు చెందిన జోగిందర్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన శివగామ్‌ పనిచేస్తున్నారు. పవన్‌సింగ్‌ మండలంలోని గొల్లపల్లిలోని ఓ గదిలో అద్దెకు ఉంటూ చుట్టుపక్కల గ్రామాల్లో నూతన భవనాల్లో టైల్స్‌ బిగించే పనులు కాంట్రాక్ట్‌ పట్టుకొని కూలీలతో చేయిస్తుండేవాడు. ఈక్రమంలో గొల్లపల్లిలోని శాతవాహనకాలనీ సమీపంలో పనులు చేస్తుండగా పవన్‌సింగ్‌ ఈనెల 14న హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన గది, పరిసర ప్రాంతాలను క్లూస్‌టీమ్‌తో పరిశీలించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సీఐ వెంకటేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈక్రమంలోనే రామగుండం రైల్వేస్టేషన్‌లో జోగిందర్‌, శివగామ్‌లను అదుపులోకి తీసుకున్నారు. డబ్బుల కోసం హత్యకు పాల్పడ్డట్లు విచారణలో తేలింది. హత్య జరిగిన తర్వాత 14 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ నాగేంద్రచారి అభినందించారు. సమావేశంలో సీఐ వెంకటేశ్‌, ఎస్సైలు రమేశ్‌గౌడ్‌, లక్ష్మణ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

గుర్తింపుకార్డులు లేకుండా ఇళ్లు అద్దెకు ఇస్తే చర్యలు

ఇళ్లను అద్దెకు ఇచ్చే సమయంలో వారి పూర్తి వివరాలు, సరైన గుర్తింపు కార్డులు తీసుకున్న తర్వాతే ఇవ్వాలని డీఎస్పీ నాగేంద్రచారి స్పష్టం చేశారు. గొల్లపల్లిలో ఇంటి యజమానులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దెకు ఉండేవారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అద్దెకు దిగే వ్యక్తుల ఆధార్‌కార్డు, పాన్‌కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపుపత్రాలను పరిశీలించాలని సూచించారు. అద్దెదారుల వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అందించాలని తెలిపారు. గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement