● ఆటో డ్రైవర్ల నిరసన
సిరిసిల్ల అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సిరిసిల్ల నేతన్నచౌరస్తా వద్ద ఆటోడ్రైవర్లు సోమవారం నిరసన తెలిపారు. ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ఆటోడ్రైవర్లు ఉత్తచేతులతో రావొద్దంటూ ప్లెక్సీ ప్రదర్శించారు. వారు మాట్లాడుతూ ఒక్కో కార్మికునికి బాకీ పడ్డ రూ.34 వేలను ముఖ్యమంత్రి చెల్లించాలని కోరారు.
సాగు, తాగునీటి వసతి కల్పించండి
ముస్తాబాద్(సిరిసిల్ల): చిప్పలపల్లిలో తాగేందుకు నీళ్లు కూడా కరువయ్యాయని, పొలాలు ఎండిపోతున్నాయని గ్రామ సర్పంచ్ గాడిచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎంపీడీవో ఆఫీస్ ఎదుట సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ చిప్పలపల్లిలో బోర్లు ఎండిపోయాయన్నారు. వెయ్యి ఎకరాల్లోని వరిపంట దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఎగువ మానేరు కెనాల్ కిలోమిటరు దూరంలోనే ఉందని, మల్లన్నసాగర్ ప్రాజెక్టు 12వ ప్యాకేజీ కెనాల్ కూడా ఉందన్నారు. వాటి ద్వారా చుక్క నీరు ఊరికి రావడం లేదన్నారు. అధికారులు సర్వే చేసి గ్రామ సరిహద్దు వరకై నా కాల్వలు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపసర్పంచ్ గాడిచర్ల రామచంద్రం, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రాజమల్లు, శ్రీనివాస్, సుద్దాల దేవయ్య, ప్రభాకర్‌రెడ్డి తదితరులున్నారు.
రెండో రోజూ పాదయాత్ర
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రోడ్ల సమస్యను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పట్టించుకోవడం లేదని రాష్ట్ర అంబేడ్కర్ యువసేన అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త, సావనపెల్లి రాకేశ్ చేపట్టిన పాదయాత్ర రెండో రోజూ సోమవారం కొనసాగింది. వెల్జీపూర్ నుంచి వల్లంపట్ల, ఓబులాపురం, మీదుగా జిల్లా కేంద్రానికి చేరుకొని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. సీపీఐ మండల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, బీఎస్పీ మండల కన్వీనర్ ఏనుగుల లింగారెడ్డి, భూమేశ్, రాజు పాల్గొన్నారు.
రైతుబంధు లేదు.. బీమా లేదు
సిరిసిల్ల: రాష్ట్రంలో రైతుబంధు రావడం లేదని, రైతుబీమా ప్రీమియం చెల్లించలేదని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు విమర్శించారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్లకు సీఎం హోదాలో తొలిసారి వస్తున్న రేవంత్‌రెడ్డి జిల్లాకు 33 నెలల్లో ఏం చేశారో లెక్కలతో రావాలన్నారు. ఏ వర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మల్కపేట రిజర్వాయర్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే.. మూడేళ్లులో ఎగువ మానేరు వరకు నీటిని ఎందుకు మళ్లించలేకపోయారని ప్రశ్నించారు. మధ్యమానేరు నిర్వాసితులకు మీరు ఇచ్చిన హామీల్లో భాగంగా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ జిల్లాలో 8 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి అయ్యాయని, 2,400 ఎకరాలు రికవరీ చేశామన్న సీఎం ఆ వివరాలను వెల్లడించాలని కోరారు. భూఆక్రమణదారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. సీఎం సభకు ప్రజలు స్వచ్ఛందంగా రావాలే తప్ప మెడపై కత్తిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్, పార్టీ నాయకులు దార్నం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, కుంభాల మల్లారెడ్డి, మాట్ల మధు, కత్తెరపాక కొండయ్య, జక్కుల నాగరాజుయాదవ్ పాల్గొన్నారు.


