● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● 218 దరఖాస్తులు స్వీకరణ
సిరిసిల్ల అర్బన్: ప్రజావాణిలో అర్జీలను పెండింగ్ పెట్టకుండా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి స్వీకరించారు. మొత్తం 218 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించాలని సూచించారు.
పింఛన్ ఇప్పించండి
మాది ఇల్లంతకుంట మండలం సిరికొండ. నా భర్త మల్లయ్య నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. నా వ యసు 85 ఏళ్లు. నాకు ఇప్పటి వరకు పింఛన్ రా వడం లేదు. పింఛన్ ఇప్పించి, న్యాయం చేయండి.
– దనుల బుచ్చవ్వ, సిరికొండ
పశువైద్య భవనం నిర్మించండి
వేములవాడ మండలం చింతల్‌ఠాణా ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో నిర్మించిన పశువైద్యశాల భవనాన్ని అంగన్‌వాడీ కేంద్రానికి వాడుతున్నారు. పశువైద్యశాల భవనం నిర్మించి, గ్రామంలో గాలికుంటూ వ్యాధి టీకా కార్యక్రమం ఏర్పాటు చేసి, పశువులకు నీటికుండీలు నిర్మించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. – చింతల్‌ఠాణా, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ
న్యాయం చేయండి
మాది సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్. నేను ఐకేఎఫ్ ప్రైవేట్ బ్యాంకు నుంచి రూ.9లక్షలు లోన్ తీసుకున్నాను. నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో నాలుగు ఈఎంఐలు కట్టలేకపోయాను. షుగర్‌తో కాలు తీసివేశారు. కొంచెం సమయం ఇవ్వండి కడుతామని చెప్పినా వినకుండా మమ్మల్ని ఇంటి నుంచి బయటకు గెంటివేశారు. ఇంటికి వేసిన తాళం ఇప్పించి న్యాయం చేయండి.
– బాగం గోపాల్, సిరిసిల్ల
‘డబుల్’ ఇళ్లు ఇప్పించండి
సిరిసిల్ల పట్టణంలోని 29వ వార్డుకు చెందిన మాకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల డ్రాలో 18 మంది పేర్లు వచ్చినవి. రెండేళ్లుగా ఇస్తామంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. అద్దె ఇండ్లలో ఉంటూ ఇబ్బంది పడుతున్నాం. ఎలాగైనా మాకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పించండి.
– డ్రాలో పేర్లు వచ్చిన లబ్ధిదారులు


