ఆదివారం.. అక్ర​​​​​​​‍‍మ‍​ దందా | - | Sakshi
Sakshi News home page

ఆదివారం.. అక్ర​​​​​​​‍‍మ‍​ దందా

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

సెలవు రోజుల్లో ‘చీకటి’ వ్యాపారం మట్టి కోసం గుట్టకు ఎసరు కాసులు కురిపిస్తున్న మొరం రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియా

సిరిసిల్ల: జిల్లాలో ఆదివారం వస్తే చాలు అక్రమ మైనింగ్‌ జోరందుకుంటుంది. అధికారులు ఎవరూ ఉండబోరని యథేచ్ఛగా మట్టి, మొరం తరలిస్తూ క్యాష్‌ చేసుకుంటున్నారు. జిల్లాలో మొరం తవ్వకానికి అనుమతులు లేవు. సెలవు రోజుల్లో పొద్దంతా అక్రమంగా తవ్వకాలు చేస్తుండగా, సాధారణ రోజుల్లో చీకటిపూట టిప్పర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈక్రమంలో అధికారులు రాకపోకలను గమనించేందుకు ఓ టీమ్‌ను రోడ్డు వెంట నిఘా కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారుల రాకను గమనిస్తే వీరు వెంటనే సమాచారం అందిస్తున్నారు. ఇలా అధికారులకు చిక్కకుండా.. మొరం, మట్టిని హిటాచీలతో తవ్వుతూ టిప్పర్లలో తరలిస్తున్నారు.

అక్రమం.. అధికంగా వసూలు

ఇళ్ల నిర్మాణంలో బరంతికి అవసరమైన మట్టిని, ఇతర అవసరాలకు మొరాన్ని ఈ మాఫియా చేరవేస్తుంది. ఒక్కో టిప్పర్‌కు రూ.4వేల నుంచి రూ.5వేలు వరకు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్‌ ట్రిప్పునకు రూ.1000 నుంచి రూ.1500 వసూలు చేస్తున్నారు. రాత్రీ, పగలు తేడా లేకుండా గుట్టలను గుల్ల చేస్తున్నారు. వీరి ఆగడాలతో వన్యప్రాణుల నివాసాలకు విఘాతం కలుగుతుంది. గుట్టలే కనుమరుగవుతున్నాయి.

పట్టుకుంటే రాజకీయ ఒత్తిళ్లు

మైనింగ్‌ అధికారులు ఈ అక్రమదందాను గుర్తించి అప్పుడప్పుడు టిప్పర్లను సీజ్‌ చేస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు. పట్టుకున్న ప్రతీసారి మైనింగ్‌ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు వస్తుండడంతో చేసేదేమీ లేక జరిమానాలతో వాహనాలను వదిలేస్తున్నారు. మైనింగ్‌ మాఫియాతో కొందరు అధికారులకు సంబంధాలు ఉండడంతో అక్రమదందా యథేచ్ఛగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. వెంకటాపూర్‌, పెద్దబోనాల, చిన్నబోనాల ప్రాంతలతోపాటు ఇంకా కొత్త ప్రాంతాల్లో మొరం తవ్వేందుకు దారులు చేస్తూ గుట్టల్లో చీకటి వ్యాపారం సాగుతోంది.

‘ఇది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ శివారులోని గుట్ట వెనకాల ప్రాంతం. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జేసీబీ ఏర్పాటు చేసి మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. సెలవు రోజు కావడంతో అడిగేవారు లేరని జేసీబీతో మట్టిని, మొరం పది ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఇలా రోజంతా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.’

Advertisement
 
Advertisement
Advertisement