అనాథ చిన్నారుల ఇళ్లకు అధికారులు
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని కంచర్ల, రంగంపేట గ్రామాల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల దీనస్థితిపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అనాథ గువ్వలు’ కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం ఆదేశాలతో ఐసీపీఎస్ కౌన్సిలర్ భార్గవి, అంగన్‌వాడీ మండల సూపర్‌వైజర్ మమత గురువారం చిన్నారుల ఇళ్లకు వెళ్లి విచారణ చేపట్టారు. రంగంపేటలో అంకమల్ల అశ్విత, కంచర్లలో ఇందు, లాస్యల కుటుంబ పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారులు వృద్ధులైన తమ నానమ్మ, అమ్మమ్మల వద్ద ఉంటున్నారని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ సాయం కోసం నివేదిక పంపిస్తామని తెలిపారు.
అనాథ చిన్నారుల ఇళ్లకు అధికారులు


