అభివృద్ధి.. సంక్షేమం
● రైతులకు అండ.. ప్రజారోగ్యానికి భరోసా ● ప్రజావాణికి పెద్దపీట ● కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● ఘనంగా గణతంత్ర వేడుకలు
సిరిసిల్ల: జిల్లాలో అభివృద్ధి.. సంక్షేమం నిరంతరంగా కొనసాగుతోందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం జాతీయజెండాను ఆవిష్కరించి, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ప్రసంగించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
రైతులకు అండగా..
రైతుభరోసాలో జిల్లాలోని 1,26,278 మంది రైతులకు రూ.149.27 కోట్లు అందించాం. 46,492 రైతులకు రూ.370.75 కోట్ల రుణమాఫీ అందింది. ఈ ఖరీఫ్‌లో 49,008 రైతుల నుంచి 2.70లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.645కోట్లు వారి ఖాతాలలో జమచేశాం. సన్నవడ్లకు రూ.500 చొప్పున రూ.3.59 కోట్లు 1,541 మందికి బోనస్ చెల్లించాం. 1,94,415 రేషన్‌కార్డులు ఉండగా.. 5,71,958 మందికి ప్రతీ నెల 665 టన్నుల సన్నబియ్యం అందిస్తున్నాం. 22,068 కొత్త రేషన్‌కార్డులు ఇచ్చాం. మహాలక్ష్మిలో 3.59 కోట్ల జీరో టికెట్లపై మహిళలు ఉచితంగా ప్రయాణించారు. 93,104 కుటుంబాలు రూ.500లకే సిలిండర్ పొందుతున్నాయి. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో మెప్మా ద్వారా రూ.2.10కోట్లతో 102 ఉపాధి యూనిట్లు ఏర్పా టు చేశాం. తొమ్మిది మండలాల సమాఖ్యల ద్వారా బస్సులను ఆర్టీసీకి అద్దెకిచ్చాం. 2,837 మహిళా సంఘాలకు రూ.382.97 కోట్లు రుణాలు అందించాం. మైనారిటీ మహిళలకు మొదటి విడతగా 495 కుట్టుమిషన్లు పంపిణీ చేశాం. గృహజ్యోతిలో 21.65 లక్షల జీరో బిల్లులు జారీచేసి రూ.84.32కోట్లు చెల్లించాము.
185 ఇందిరమ్మ ఇండ్లు పూర్తి
జిల్లాలో 7,408 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా 185 పూర్తి చేశాం. రెండు పీహెచ్‌సీ భవనాలు పూర్తి చేశాం. 17 ఆరోగ్య సబ్‌సెంటర్ల భవనాలు ప్రగతిలో ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఏడాది 51 శాతం ప్రసవాలు జరిగాయి. జిల్లాలో 24 గంటలూ అత్యవసర వైద్యసేవల కోసం 12 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా 90 రకాల రక్తపరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. కాటమయ్య రక్షా సేఫ్టీ కిట్లను 1,050 మంది గీతకార్మికులకు ఉచితంగా అందించాం.
రూ.291కోట్లతో ఆలయ అభివృద్ధి
రూ.291కోట్లతో శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రధాన ఆలయ విస్తరణ, బద్దిపోచమ్మ గుడి అభివృద్ధి, రోడ్ల విస్తరణ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సహకారంతో నాంపల్లిగుట్టపై యుద్ధ విమానం ఏర్పాటు పనులు చేస్తున్నాం. మరిన్ని పనుల కోసం రూ.980 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నేతన్న పొదుపు, నేతన్న భరో సా, నేతన్న భద్రత పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వేములవాడలో రూ.50కోట్ల కార్పస్ ఫండ్‌తో నూలు బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఇందిరమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లతో నేతకా ర్మికులకు నిరంతరం ఉపాధి అందుతుంది. అపెరల్‌పార్క్‌లో రూ.9కోట్లతో రెండు ప్రైవేటు కంపెనీలు ప్రారంభం కాగా.. 1,900 మందికి ఉపాధి లభిస్తుంది. 309 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటైంది.
విద్యతో వికాసం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణంలో భాగంగా వేములవాడ నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. 13 కేజీబీవీల్లో ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సు, ఎంసెట్ ఇతర పోటీపరీక్షల్లో శిక్షణ ఇస్తున్నాం. 486 పాఠశాలలో ఐసీటీ ల్యాబ్స్ ఏర్పాటు చేసి ఎఫ్‌ఎల్‌పీల ద్వారా 38 వేల మంది విద్యార్థులకు డిజిటల్ బోధన అందిస్తున్నాం. 10 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో వసతులకు రూ.1.81కోట్లు, ప్రయోగశాలలకు ఒక్కో కాలేజీ రూ.50వేలు మంజూరయ్యాయి.
తాగునీటి సరఫరాలో..
వేసవిలో తాగునీటి సరఫరాలో ఇబ్బంది రాకుండా ముందుస్తు ప్రణాళికతో వెళ్తున్నాం. 348 చెరువుల్లో 1.36 కోట్ల చేప పిల్లలను నీటివనరుల్లో వదిలాం. మరో ఐదు చెరువులలో 29.80 లక్షల మేలు రకాలైన రొయ్యపిల్లలు విడుదల చేస్తాం. 1,16,612 మందికి ప్రతీ నెల రూ.25.60కోట్ల చేయూత పెన్షన్లు అందిస్తున్నాం.
మహిళా, శిశు, వృద్ధుల సంక్షేమానికి..
వృద్ధుల కోసం ఆశ్రమాలు ఏర్పాటు చేసి 41 మందికి సేవలు అందిస్తున్నాం. 25 మంది ట్రాన్స్‌జెండర్స్‌కు గుర్తింపుకార్డులు ఇచ్చాం. సఖీ ద్వారా 1,364 కేసులు పరిష్కరించాం. దివ్యాంగ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అందిస్తున్నాం. దివ్యాంగులకు పెట్రోల్‌పంపు ఏర్పాటు చేశాం. 104 మంది దివ్యాంగులకు స్వయం ఉపాధికి రూ.96.89 లక్షల సబ్సిడీ అందించాం. మిషన్ వాత్సల్యలో 112 మంది అనాథ పిల్లలకు నెలకు రూ.4వేల చొప్పున అందిస్తున్నాం. అంగన్‌వాడీల్లో 18,838 మందికి ఆరు నెలలుగా నెలకు 2.5 కిలోల బాలామృత ప్యాకెట్లు, 16 గుడ్లు అందిస్తున్నాం. 8 నూతన అంగన్‌వాడీ భవనాలు నిర్మించాం. వేములవాడలో నూతన ఐసీడీఎస్ భవనం ప్రారంభించాం.
ప్రజావాణికి పెద్దపీట
ప్రజావాణి ద్వారా 3,074 దరఖాస్తులు పరిష్కరించాం. భూ భారతి అమలులో భాగంగా 66 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించాం. గ్రామపంచాయతీలలో పారిశుధ్య నిర్వహణ కోసం 1,203 మంది మల్టీపర్పస్ వర్కర్లను నియమించి, ప్రతి నెలా రూ.9,500 చొప్పున వేతనం అందజేస్తున్నాం. జిల్లాలో 9 కొత్త జీపీ భవనాలు నిర్మించాం. సిరిసిల్ల, వేములవాడల్లో జంక్షన్ల సుందరీకరణ, డ్రైనేజీలు, సీసీ రోడ్ల పనులు చేపట్టాం. గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, డీఎస్పీ నాగేంద్రచారి, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ భర్త, కొడుకు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
నర్సింగ్ కాలేజీ, కేజీబీవీ, మైనార్టీ గురుకుల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని పెంచే పాటలకు నృత్యాలు చేశారు. వివిధ శాఖల శకటాల ప్రదర్శన చేపట్టారు. మత్స్యశాఖ, చేనేత జౌళిశాఖ, వ్యవసాయ శాఖల శకటాలు ఆకర్షణగా నిలిచాయి. కలెక్టర్, ఎస్పీలు స్టాల్స్‌ను పరిశీలించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో, కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్ గరీమా అగ్రవాల్ జాతీయజెండాను ఆవిష్కరించారు.
అభివృద్ధి.. సంక్షేమం
అభివృద్ధి.. సంక్షేమం
అభివృద్ధి.. సంక్షేమం
అభివృద్ధి.. సంక్షేమం


