జూకీ శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
టెక్స్‌టైల్ పార్క్‌లో శిక్షణ.. అపెరల్ పార్క్‌లో ప్లేస్‌మెంట్ శిక్షణకు పోటీ పడుతున్న మహిళలు ఇప్పటికే 4,001 మందికి శిక్షణ మరో 300 మంది నిరీక్షణ
సిరిసిల్ల: ఇన్నాళ్లు రెక్కలు ముక్కలు చేసుకున్నా నెలకు ఆదాయం రూ.2వేలు దాటలేదు. అదే నైపుణ్యం ఉన్న జూకీ శిక్షణతో మహిళలకు ఉపాధి పక్కాగా లభిస్తుంది. శిక్షణ ఇవ్వడంతోపాటు స్థానికంగా ఉన్న అపెరల్‌పార్క్‌లోని పలు గార్మెంట్స్ కంపె నీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 4,001 మంది తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్ పార్క్‌లో చేనేత, జౌళిశాఖ ఏర్పాటు చేసిన కేంద్రంలో శిక్షణ పొందారు. వీరిలో 1,654 మంది అపెరల్ పార్క్‌లోని గోకుల్‌దాస్, టెక్స్‌పోర్టు గార్మెంట్ యూనిట్లలో ఉపాధి పొందుతున్నారు. వీరంతా గతంలో బీడీలు చుట్టి.. రెక్కలు ముక్కలు చేసుకున్న వారే. మెరుగైన ఉపాధితో కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు.
స్వల్ప శిక్షణ.. దీర్ఘకాలిక భద్రత
శిక్షణ కాలం పది రోజులైనా.. నమ్మకమైన ఉపాధికి బాటలు పడుతున్నాయి. టెక్స్‌టైల్ పార్క్‌లో 35 జూకీ మిషన్లపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కాలానికి రూ.వెయ్యి ఉపకార వేతనం అందిస్తున్నారు. పని నేర్చుకోవడంతోపాటు పది రోజులకు రోజుకు రూ.100 చొప్పున ఉపకార వేతనం రావడంతో శిక్షణపై అతివలు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో బ్యాచ్‌కు 30 నుంచి 35 మందికి శిక్షణ ఇస్తున్నారు. కుట్టుపై అవగాహన లేని వారికి ప్రత్యేకంగా 25 రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. నిత్యం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. మధ్యలో భోజన విరామం 45 నిమిషాలు ఇస్తున్నారు. శిక్షణ పూర్తి చేసిన వారికి చేనేత, జౌళిశాఖ ద్వారా సర్టిఫికెట్ అందిస్తున్నారు.
టెక్స్‌టైల్ పార్క్‌లో శిక్షణ..
అపెరల్ పార్క్‌లో ప్లేస్‌మెంట్
సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరు వద్ద 60 ఎకరాల్లో రెడీమేడ్ దుస్తుల తయారీ కేంద్రం అపెరల్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. అపెరల్ పార్క్‌లో రెండు యూనిట్లు ప్రారంభమయ్యాయి. టెక్స్‌టైల్‌పార్క్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అపెరల్‌పార్క్‌లో వెంటనే ఉపాధికి ప్లేస్‌మెంట్ లభిస్తుంది. గార్మెంట్ రంగంలో రూ.8వేల నుంచి రూ.10వేల వరకు ప్రతీ నెల నమ్మకమైన ఉపాధి లభిస్తుంది. గతంలో ఇతర పనులు చేసిన మహిళలకు మెరుగైన జీతాలు రావడంతో ఆసక్తిగా అపెరల్‌పార్క్‌కు వెళ్తున్నారు. సిరిసిల్ల, జిల్లెల్ల, ఎల్లారెడ్డిపేట మార్గాల్లో కంపెనీ బస్సుల ద్వారా ఉచితంగా రవాణా వసతి కల్పించారు. అపెరల్ పార్క్‌కు వెళ్లలేని వారు శిక్షణ పూర్తి చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు.


