సంచారి.. స్వయం ఉపాధి
ఊరూరా తిరుగుతూ విక్రయాలు
స్వయం ఉపాధితో బాటలు
మైకుల్లో ప్రచారంతో పల్లెల్లో వ్యాపారం
ఇతను ఇబ్రహీంపూర్‌కు చెందిన నర్సింలు. రోజూ ఉదయం 5 గంటలకే బైకుపై కారీల కాటన్ పెట్టుకుని, మైకు బిగించుకొని బయలుదేరుతాడు. మెమొరీ కార్డులో రికార్డు చేయించుకున్న వాయిస్‌ను మైకులో పెట్టి ఉపాధి పొందుతున్నాడు. ఇలా నిత్యం పది గ్రామాలు తిరుగుతూ ఉదయం 9 గంటల్లోపు 20 కిలోల కారీలను అమ్ముతాడు. తర్వాత సొంతూరికి వెళ్లి హోటల్ నిర్వహించుకుంటున్నాడు. రోజుకు రూ.వెయ్యి వరకు సంపాదిస్తూ.. పనిలేదని చెప్పే నిరుద్యోగ యువతకు ఆదర్శం ఈ యువకుడు.
అల్లం, ఎల్లిగడ్డ అమ్ముతున్న ఇతను యాదాద్రిభువనగిరి జిల్లాకు చెందిన రాజునాయక్. వ్యాన్‌లో అల్లం, ఎల్లిగడ్డలు అమ్ముతున్నాడు. పదో తరగతి వరకు చదివిన రాజు రోజు 30 గ్రామాలు తిరుగుతాడు. రోజు క్వింటాలుకు పైగా సరుకు విక్రయిస్తాడు. వాహనంలోనే వంట చేసుకొని, రాత్రయితే అందులోనే పడుకుంటాడు. ఇలా ఐదు రోజులు వ్యాపారం చేసి రెండు రోజులు ఇంటి వద్ద ఉంటాడు. సరుకు మొత్తం అమ్ముడుపోయాక హైదరాబాద్‌కు వెళ్లి కొనుక్కొని, మళ్లీ ఊర్ల బాట పడతాడు. ఇలా వారానికి రూ.15వేల వరకు సంపాదిస్తాడు.
ముస్తాబాద్(సిరిసిల్ల): ఒకప్పుడు కోడికూతలతో నిద్రలేచే పల్లెజనం.. నేడు మైకుల ప్రచారంతో దినచర్యను ప్రారంభిస్తున్నారు. దశాబ్దం క్రితం టమాట.. పచ్చకూర.. కొత్తిమీర.. చేపలు.. అంటూ మహిళా రైతులు నెత్తిన గంపలు పెట్టుకొని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ విక్రయించేవారు. ఆత్మీయ పలకరింపులతో అమ్మకాలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. యాంత్రీకరణ శరవేగంగా జరగడంతో చిరువ్యాపారులు గ్రామాల్లోకి వాహనాలతో ప్రవేశించారు. నిత్యం ఇంటి వద్దకే తాజా కూరగాయలు, పండ్లు, తినుబండారాలతో వస్తున్నారు. వందలాది మంది యువకులు బైకులు, ఆటోలపై సరుకులు పెట్టుకుని మైకులతో ప్రచారం చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు.
సూపర్‌మార్కెట్లు, మాల్స్‌కు ధీటుగా..
ఎన్ని సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌మాల్స్ వచ్చినా పల్లెజనం వారి వద్దకు వచ్చే చిరువ్యాపారుల వద్ద కొంటూనే ఉన్నారు. దీంతో వారికి మంచి ఉపాధి దొరుకుతుంది. కూరగాయలు మొదలు బట్టలు, నిత్యావసర వస్తువులు ఆఖరికి ఇంటి ముందు వేసే రాయిముగ్గు, ఇడ్లి, దోశ కూడా ఇంటికే వస్తుండడంతో దుకాణాలకు వెళ్లడం తప్పుతుంది.
సంచారి.. స్వయం ఉపాధి
సంచారి.. స్వయం ఉపాధి


