బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓట్లేసి దండుగ
● అమృత్ కింద రూ.104 కోట్లు ఇస్తే ఏం చేశారు? ● బీజేపీని గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం ● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్
సిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఓట్లేసి దండుగేనని బీజేపీని గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలో సోమవారం బీజేపీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లలో ఆరు గ్యారంటీలు అమలయ్యాయా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు రూ.5వేలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండి పడ్డారు. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్ధిక సంఘం నిధులు రూ.30 కోట్లు ఇచ్చిందని తెలిపారు. అమృత్ కింద రూ.104 కోట్లు ఇచ్చిందన్నారు. కేంద్రం ఇంత పెద్ద ఎత్తున నిధులిస్తే.. ఎన్నడైనా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలకులు మోదీ ప్రభుత్వం పైసలిచ్చిందని చెప్పలేదన్నారు. కేంద్రం నిధులిస్తే సక్రమంగా ఖర్చు చేయకుండా, వర్షం వస్తే సిరిసిల్ల మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. చివరికి కలెక్టరేట్ కూడా మునిగి పోయిన దుస్థితిని మనం చూశామన్నారు. మున్సి పల్ ఎన్నికల్లో పువ్వు గుర్తుకు ఓట్లేసి గెలిపిస్తే... రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు తీసుకొస్తామన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓట్లేస్తే డ్రైనేజీలో వేసినట్లే అన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్మన్ స్థానాలు దక్కించుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్, ఆడెపు రవీందర్, అన్నల్‌దాస్ వేణు, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మోర రవి, బర్కం లక్ష్మీనవీన్, శీలం రాజు పాల్గొన్నారు.


