ఎవరి‘కో’ ఆప్షన్!
గ్రామ పంచాయతీల్లో పదవులు
ప్రతీ గ్రామంలో ముగ్గురికి చాన్స్
జిల్లాలోని 260 గ్రామాల్లో 780 మందికి అవకాశం
ప్రభుత్వ ఆదేశాల కోసం నిరీక్షణ
కో ఆప్షన్ పదవులపై ఆశలు
సిరిసిల్ల: గ్రామ పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కోఆప్షన్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 2018 పంచాయత్ రాజ్ చట్టం ప్రకారం ప్రతీ గ్రామ పంచాయతీలోనూ మరో మూడు కోఆప్షన్ పదవులు ఏర్పాటవుతాయి. కో ఆప్షన్ సభ్యులుగా ఓ రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి, గ్రామాభివృద్ధి కోసం ఏదైనా విరాళంగా అందించిన దాత, మరో మహిళా సంఘం సభ్యురాలు లేదా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నియామకం కానున్నారు. ఈ ముగ్గురు కోఆప్షన్ సభ్యులకు గ్రామ పంచాయతీలో ప్రాతినిథ్యం ఉండటంతో పలువురు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వపరంగా వచ్చే ఆదేశాల కోసం పల్లెల్లో పలువురు నిరీక్షిస్తున్నారు.
పాలకవర్గాలకు శిక్షణ
గ్రామాల్లో కొత్తగా ఎన్నికై న పాలకవర్గాలు ఇంకా గ్రామపంచాయతీపై పట్టు సాధించలేదు. డిసెంబర్ 22న సర్పంచులు, వార్డుసభ్యులు ప్రమాణస్వీకారం చేయగా నిధులు, విధులకు సంబంధించి స్పష్టత లేకపోవడంతో కొత్త పాలకవర్గాలు పూర్తిస్థాయి ఆజమాయిషీ చేయలేకపోతున్నాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచులు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు గ్రామాల్లో వారి విధులు, బాధ్యతలపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఎంపీడీవోలకు, ఎంపీవోలకు, ఉపాధిహామీ ఇబ్బందికి హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ పొందిన వారు క్షేత్రస్థాయిలో మండలాల వారీగా గ్రామపంచాయతీ పాలకవర్గాలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత కో ఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ తెరపైకి వస్తుందని భావిస్తున్నారు.
గతంలో మొక్కుబడి పాత్రనే..
2019లోనూ అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ముగ్గురు చొప్పున ప్రభుత్వ నిబంధనల మేరకు కో ఆప్షన్ సభ్యులను నియమించారు. కానీ పల్లె పాలనలో వారి పాత్ర మొక్కుబడి తంతుగానే ఉంది. నిజానికి గ్రామపంచాయతీ పాలన సవ్యంగా సాగేందుకు రిటైర్డు ఉద్యోగి అనుభవాలను, ఊరికి ఉపకారం చేసిన దాత ఆలోచనలను, మహిళా సంఘం సభ్యురాలు లేదా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సేవా భావాలను పల్లె పాలనలో రంగరించి కొనసాగించాలనే ఉదాత్తమైన ఆలోచన ఆచరణలో విఫలమైంది. కానీ ఈసారి కోఆప్షన్ సభ్యులను నియమించి వారిని చురుగ్గా పని చేసే విధంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామపంచాయతీ పాలకవర్గాలకు విధులు, బాధ్యతలపై శిక్షణ పూర్తి కాగానే కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఆదేశాలు వస్తాయని భావిస్తున్నారు.
జిల్లాలోని గ్రామాల్లో డిసెంబర్ 22న కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మద్ధతుదారులైన 116 మంది, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మద్దతుదారులు 106, బీజేపీకి చెందిన 22 మంది, సీపీఎం మద్దతుదారులు ఇద్దరు, బీఎస్పీ ఒక్కరు, స్వతంత్రులు మరో 13 మంది సర్పంచులుగా ఉన్నారు. వార్డుసభ్యుడిగా పోటీచేసి ఖర్చు పెట్టుకుని అనేక మంది ఇబ్బంది పడ్డారు. ఏ ఇబ్బంది లేకుండానే కోఆప్షన్ సభ్యుడిగా గ్రామపంచాయతీలో కూర్చునే అవకాశాన్ని వినియోగించుకోవాలని పలువురు స్థానిక నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఎన్నికై న సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డుసభ్యులను మచ్చిక చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ముగ్గురు కాంగ్రెస్, ఒక్క బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో వారి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.


