‘ఇందిరమ్మ’ పనుల్లో వేగం పెంచాలి
నెలాఖరులోగా ఇళ్లు పూర్తి చేయాలి
కలెక్టర్ గరీమా అగ్రవాల్
వీర్నపల్లి(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం వీర్నపల్లిలో లబ్ధిదారులు లెంకల దివ్య, మహ్మద్ నూర్జహ, మహ్మద్ రేష్మా, ఎర్రగడ్డతండాలో మాలోత్ విజయల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు ఎప్పుడు మొదలు పెట్టారు? ప్రభుత్వ ఆర్థిక సాయం అందుతుందా? ఆరా తీశారు. స్లాబ్ దశలో ఉన్న ఇళ్లను ఈనెలాఖరులోగా పూర్తిచేసి గృహ ప్రవేశానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామంలో సేకరిస్తున్న చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి సెగ్రిగేషన్ చేయాలని ఎర్రగడ్డతండా సర్పంచ్ నీలాబాయ్‌కి సూచించారు.
వీర్నపల్లి పీహెచ్‌సీ తనిఖీ
వీర్నపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, వ్యాక్సిన్ గది, ల్యాబ్, ఫార్మిసీ తదితర వాటిని పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు.
యూడీఐడీ బ్లాక్ పూర్తి చేయాలి
సిరిసిల్లటౌన్: యూడీఐడీ బ్లాక్ (విభాగం) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో యూడీఐడీ కేంద్రం కోసం బ్లాక్ (విభాగం), ప్రత్యేక టాయిలెట్ నిర్మాణ పనులు, ఫర్నిచర్, ఇతర పనులను మంగళవారం పరిశీలించారు. యూడీఐడీ బ్లాక్ (విభాగం) ప్రవేశ ద్వారం వద్ద నేమ్ బోర్డు రాయించాలని, గోడలపై రంగులు వేయించాలని, ఆవరణ అంతా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇటీవల భోజనంలో పురుగులు రావడంతో పేషెంట్లకు భోజనాలు సిద్దం చేసే గదిని తనిఖీ చేశారు. పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
బ్లాక్ స్పాట్లు గుర్తించాలి
బ్లాక్ స్పాట్లు గుర్తించి, నియంత్రణ చర్యల ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్‌లో ఆర్‌అండ్‌బీ నేషనల్ హైవేస్, పీఆర్, పోలీస్, ట్రాన్స్‌పోర్టు, వైద్య, విద్య, ఎకై ్సజ్, ఆర్టీసి తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రవాణా, ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవేస్, పోలీస్ శాఖ సంయుక్తంగా చేసిన క్షేత్రస్థాయి పరిశీలనపై ఆరా తీశారు. ఎస్పీ మహేశ్ బీ గితే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్ అలైవ్ జిల్లాలో 10రోజుల పాటు అమలు చేస్తామని అన్నారు. ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, నిర్వహిస్తామని వివరించారు.
టీపీటీఎఫ్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
సిరిసిల్లఅర్బన్: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) డైరీ, 2026 క్యాలెండర్‌ను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆవిష్కరించారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాల రామనాథ్‌రెడ్డి, నాయకులు అంజయ్య, శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్, రామచంద్రం,కృష్ణ, బండి ఉపేందర్, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


