నో హెల్మెట్.. నో పెట్రోల్
● ప్రతి బంక్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి ● డే కేర్ సెంటర్‌ను వినియోగించుకోవాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ప్రతీ పెట్రోల్ బంక్ యజమానులు సామాజిక బాధ్యతగా ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ను అమలు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. రోడ్డు భద్రత జాతీయ మాసోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని పెట్రోల్ బంక్‌ల యజమానులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గతేడాది 290 ప్రమాదాలు జరిగాయని, ఎక్కువ ప్రమాదాలు ద్విచక్రవాహనదారులకు జరుగుతున్నాయన్నారు. పెట్రోల్‌బంక్ యజమానులు సామాజిక బాధ్యతగా నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు చేయాలని, బంక్‌లలో పనిచేసే సిబ్బందికి ఈ సమాచారం చేరవేసి పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ ప్రతీ బంక్ యజమానులు తమ బంక్‌లో నో హెల్మెట్ .. నో పెట్రోల్ ఫ్లెక్సీలు రెండు ఏర్పాటు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్, పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్, డీఎం రజిత పాల్గొన్నారు.
డే కేర్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి
డే కేర్ సెంటర్ సేవలను వృద్ధులు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రణామ్ పేరిట ఏర్పాటు చేసిన వృద్ధుల డే కేర్ సెంటర్లను సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వృద్ధుల డే కేర్ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. వృద్ధుల మానసికోల్లాసం, భద్రత, సంరక్షణ లక్ష్యంగా ‘ప్రణామ్’లో ప్రభుత్వం మల్టీసర్వీస్ డే కేర్ సెంటర్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. సెంటర్లలో లైబ్రరీ, ఇండోర్‌గేమ్స్, టీవీ సదుపాయంతో అందుబాటులో ఉంటాయని వివరించారు. వృద్ధులకు ఉచితంగా స్నాక్స్‌తోపాటు టీ అందిస్తారని తెలిపారు. దినపత్రికలు, పక్ష, మాసపత్రికలు, కథల పుస్తకాలు, మ్యాగజైన్‌లు ఉంటాయని వివరించారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ నేత కె.కె.మహేందర్‌రెడ్డి, ఐఆర్సీఎస్ జిల్లా అధ్యక్షుడు గుడ్ల రవి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్‌ప్రెసిడెంట్ జలపాల శంకరయ్య, జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు.
ఘనంగా వివేకానంద జయంతి
కలెక్టరేట్‌లో జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో సోమవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, డీవైఎస్‌వో రాందాస్ పాల్గొన్నారు.


