
పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత
● విధిగా మొక్కలు నాటాలి ● ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్లక్రైం: పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి సామాజిక బాధ్యత అని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం సిరిసిల్లలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రగుడు చౌరస్తా నుంచి బతుకమ్మఘాట్ వరకు సాగిన సైకిల్ ర్యాలీలో పాల్గొని మొక్కలు నాటారు. స్వచ్ఛమైన ఆహ్లాదకమైన వాతావరణం ఏర్పాటు కోసం మొక్కలు నాటాలన్నారు. నాటిన ప్రతీ మొక్కను కాపాడాల్సిన బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని సూచించారు. పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని, ఫలితంగా అక్కడ ఉండే వారి ఆరోగ్యం బాగుంటుందన్నారు. భూ మండలంపై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణవాయువు ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు రఘుపతి, శ్రీనివాస్‌గౌడ్, వీరప్రతాప్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐలు యాదగిరి, రమేశ్, ఎస్సైలు, సిబ్బంది, పాల్గొన్నారు.