ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా

Published Sun, May 19 2024 7:40 AM

ఉమ్మడ

ఎన్నో చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు..

భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తున్న వైనం చూసొద్దాం.. రండి

కొండల మధ్య రాముని గుండాలు

రామగుండం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ముచ్చగొలిపే చారిత్రక ప్రాంతం రాముని గుండాలు. కొండపైకి ఎక్కి చూస్తే కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలను కలిపే గోదావరినది, బొగ్గు గనులు, విద్యుత్‌ కేంద్రం కనువిందు చేస్తాయి.

కరీంనగర్‌: ఒకప్పుడు కల్లోల ప్రాంతాలతో ఉన్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నేడు పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోనే పేరెన్నిక గన్న సిల్వర్‌ ఫిలిగ్రీతోపాటు నాణ్యమైన నల్ల బంగారు గనులకు

ప్రసిద్ధి పొందింది. ఎన్నో చారిత్రక స్థలాలు, కట్టడాలు, ఆధ్యాత్మికతను పరిమళింపజేసే ఆలయాలు

ఆకర్షిస్తున్నాయి. దర్శించుకోవాలంటూ పర్యాటకులు, భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి.

వాటిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

నాలుగు నూర్ల దేవాలయాలు..

నగునూరు

కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగునూరులో పూర్వం చాళుక్యులు, కాకతీయుల సామంతరాజులు 4 గుట్టలను కలుపుతూ కోటను నిర్మించి, పరిపాలన సాగించారు. బౌద్ధుల కాలం నాటి శాసనాలు, విగ్రహాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. గంగాధరుడు నిర్మించిన త్రికూటాలయం నాటి శిల్పకళా ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు 400 దేవాలయాలు ఉండేవని, నాలుగు నూర్ల దేవాలయాలు ఉన్న ఊరు కాస్త నగునూరుగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. గ్రామం వెలుపల అతిసుందరమైన పెద్ద నాగశిల్పం ఉంది. హైదరాబాద్‌కు చెందిన కాసుగంటి నారాయణరావు ట్రస్టు ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.

దక్షిణకాశీ.. వేములవాడ

కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదాయంలో తిరుపతి తర్వాత రెండోది. దక్షిణకాశీగా కీర్తిగాంచిన ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్య వంశీయుడైన ఆరో విక్రమాదిత్యుడు వెయ్యేళ్ల క్రితం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. కోడె మొక్కు ఆచారం ఇక్కడ తప్ప రాష్ట్రంలో మరెక్కడా లేదు. మతసామరస్యానికి ప్రతీకగా దర్గాతోపాటు జైన దేవాలయాలు ఇక్కడ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సైఫన్‌.. నాగులపేట

కోరుట్లకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగులపేట సైఫన్‌ ఆసియా ఖండంలోనే అరుదైన నిర్మాణంగా కీర్తిగాంచింది. భూగర్భంలోకి కాలువలోని నీరు మాయమై, వాగు దాటాక తిరిగి ప్రత్యక్షమవుతుంది. కింద కాలువ, పైన వాగు ఉండటం ఈ సైఫన్‌ ప్రత్యేకత.

కోర్కెలు తీర్చే అంజన్న.. కొండగట్టు

మల్యాల మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. కరీంనగర్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 300 ఏళ్ల కింద ఈ ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇప్పుడున్న గుడి మాత్రం 160 ఏళ్ల కింద కృష్ణారావు దేశ్‌ముఖ్‌ నిర్మించారు. భక్తుల కోర్కెలు తీర్చే దేవునిగా ఆంజనేయస్వామి పేరు పొందారు. కొండల రాయుని కోట, గుహలు, బొజ్జ పోతన, సీతమ్మవారి కన్నీటి గుంటలు చూడదగినవి.

వందేళ్ల నాటి ఎలగందుల ఖిల్లా

కాకతీయులు, బహమనీలు, కుతుబ్‌షాహీలు, మొగలులు, అసఫ్‌జాహీలకు రాజధానిగా విలసిల్లిన ఎలగందుల కరీంనగర్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి కోట కొండపై మసీదు ఉంది. దాని మీనార్‌ ఒకటి కదిపితే కదులుతుందని అంటారు. లోపల బంగారు రంగు చిత్రాలు చూపరులను ఆకర్షిస్తాయి.

బౌద్ధ స్తూపం.. ధూళికట్ట

ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామం కరీంనగర్‌కు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1975 నుంచి 77 వరకు జరిపిన తవ్వకాల్లో నాటి కోట, బౌద్ధ స్తూపం బయటపడ్డాయి. కోట ముఖద్వారం వద్ద రాగి నాణేలు, మట్టి బొమ్మలు దొరికాయి.

శాతవాహనుల రాజధాని..

కోటిలింగాల

శాతవాహనుల రాజధాని కోటిలింగాల. వెల్గటూర్‌ మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఎక్కడచూసినా శివలింగాలు, శిల్పకళా ఖండాలు, ఖండాల ఖండికలు కనిపిస్తుంటాయి. పురవాస్తు శాఖవారు జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల హయాంలోని నాణేలు, ఇతర స్మారక చిహ్నలు వెలుగుచూశాయి. ఇక్కడి గోదావరినది నడి ఒడ్డున శ్రీకోటేశ్వరస్వామి ఆలయం ఉంది.

త్రివేణి సంగమ క్షేత్రం.. కాళేశ్వరం

కరీంనగర్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం.. శ్రీశైలం, ద్రాక్షారామం అంతటి విశిష్టమైంది. గోదావరి, ప్రాణ హిత, సరస్వతీ నదులు సంగమించే చోటిది. ప్రధాన ఆలయంలో కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి లింగాలు ఒకే పానపట్టంపై ఉండటం విశేషం. ఇక్కడి లింగంపైన గల నాసికలో ద్రవం పోస్తే త్రివేణి సంగమంలో కలుస్తుందని ప్రతీతి. ప్రధాన ఆలయానికి కిలోమీటర్‌ దూరంలో ముక్తీశ్వరాలయం ఉంది. దీని చుట్టూ ఉన్న చిన్నచిన్న రాళ్లలో నుంచి విభూది రాలడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

నృసింహుని క్షేత్రం.. ధర్మపురి

కరీంనగర్‌కు ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి నృసింహుని క్షేత్రం ఉంది. అర్ధాయుష్కు డైన కుమారుడి కోసం బలివర్మ మహారాజు దేవతాయాగం చేసి, విజయం సాధించడం, ప్రజలు ధర్మబద్ధంగా జీవించడం కారణంగా ధర్మపురిగా వాసికెక్కింది. పద్మాసనంలో లక్ష్మీ సమేతుడై వెలసిన నరసింహస్వామితోపాటు, రామలింగేశ్వరాలయం పక్కపక్కనే ఉండి శైవ, వైష్ణవ సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

వీరభద్రస్వామి.. కొత్తకొండ

భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ మీసాల వీరభద్రస్వామి దేవస్థానం అతి పురాతనమైంది. కాకతీయ రుద్రేశ్వరుని కాలం క్రీ.శ. 1410లో మల్లికార్జున పండితుని మనవడైన కేదారిచే ఆలయ నిర్మాణం జరిగింది. ఏటా సంక్రాంతికి జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.

రాజ భవనాలు.. రామగిరి ఖిల్లా

పెద్దపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో గోదావరినదీ తీరాన శత్రుదుర్భేద్యమైన రామగిరి ఖిల్లా ఉంది. ఇక్కడి కోటలో సీతారామలక్ష్మణలు కొంతకాలం నివసించి చాతుర్మస్య వ్రతం ఆచరించినట్లు స్థానికులు చెప్పుకుంటారు. కోట లోపల గల అనేక రాజ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడి ప్రకతి సౌందర్యానికి ఆకర్షితుడైన ఔరంగజేబు దీన్ని ఆరామ్‌ గిరి అని పిలిచారంటారు.

మరికొన్ని ఆలయాలు..

సారంగాపూర్‌ మండలంలోని పెంబట్ల గ్రామంలో దుబ్బ రాజేశ్వరస్వామి, ఓదెల మల్లికార్జునస్వామి, ఇల్లంతకుంట మండలంలోని జంగంపల్లి శ్రీరామలింగేశ్వర స్వామి, గంగాధర మండలంలోని నందగిరి లక్ష్మీనర్సింహస్వామి, రాయికల్‌లోని కేశవనాథ పంచముఖ లింగేశ్వర త్రికూట ఆలయాలు, కోరుట్ల మండలంలోని నాగులపేట సైఫన్‌, మొలంగూరు ఖిల్లా సందర్శించదగినవి.

సైనిక స్థావరం.. జగిత్యాల ఖిల్లా

కరీంనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల ఖిల్లాను జాఫరుద్దౌలా హయాంలో ఫ్రెంచ్‌ ఇంజినీర్లు నిర్మించారు. 20 ఎకరాల విస్తర్ణంలో పూర్తిగా రాతితో నిర్మించిన ఈ ఖిల్లా నాడు సైనిక స్థావరంగా ఉండేది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది.

పురావస్తు ప్రదర్శన శాల

కరీంనగర్‌ బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న పురావస్తు ప్రదర్శన శా లను 1964లో నెలకొల్పి, 1984లో ఆధునీకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తవ్వకాల్లో వెలుగుచూసిన శాతవాహనులు, కాకతీయులు, అసఫ్‌జాహీల చిహ్నాలు, నాణేలు, స్టాంపులు, యుద్ధ సామగ్రి, పుణ్యక్షేత్రాల అవశేషాలను ఇక్కడ ఉంచారు.

మంత్రపురి.. మంథని

అనాదిగా వైదిక సంస్కృతి వైభవాన్ని పరిరక్షిస్తున్న మంత్రపురి ప్రస్తుతం మంథనిగా పిలువబడుతోంది. కరీంనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో గోదా వరి నదీతీరాన వెలసిన గౌతమేశ్వరాలయంలోని బ్రాహ్మణోత్తములు వేదాధ్యయనంలో మేటిగా నిలిచారు. అప్పట్లో మంథనికి వాస్తు అక్కరలేకుండా నాలుగు దిక్కులా 4 శివలింగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం వాటిని దాటి, విస్తరించింది.

రామాలయం.. ఇల్లందకుంట

హుజూరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని ఇల్లందకుంట మండల కేంద్రంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. దండకారణ్యంలో వవవాసం చేస్తున్న సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారని, దశరథుని మరణవార్త తెలిసి ఇల్లంద గింజలతో తర్పణం వదిలారని ప్రతీతి. నల్ల గొండ జిల్లాకు చెందిన రాఘవరెడ్డి ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది.

ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా
1/5

ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా

ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా
2/5

ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా

ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా
3/5

ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా

ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా
4/5

ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా

ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా
5/5

ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement