ధర్నా చేసినప్పుడే వేతనాలు..లేకపోతే ఒట్టిచేతులు | - | Sakshi
Sakshi News home page

ధర్నా చేసినప్పుడే వేతనాలు..లేకపోతే ఒట్టిచేతులు

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

● వేతనాల కోసం జీజీహెచ్‌ పారిశుధ్య కార్మికుల పోరాటం

ఒంగోలు టౌన్‌: రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో సహనం నశించిన జీజీహెచ్‌ పారిశుధ్య కార్మికులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు శానిటేషన్‌ ఏజన్సీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పెద్ద సంఖ్యలో పారిశుధ్య కార్మికులు నిరసనకు దిగి వేతనాల కోసం నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ధర్నాలు చేసినప్పుడు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, లేకపోతే చాకిరి చేయించుకుంటూ ఒట్టి చేతులు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికుల వేతనాలను సకాలంలో ఇప్పించడంలో జీజీహెచ్‌ ఉన్నతాధికారులు విఫలమవడం దారుణమని పలువురు పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు అడిగితే ప్రభుత్వం బడ్జెట్‌ పెట్టలేదని చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని విమర్శించారు. వేతనాలు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకొని కూర్చున్నారు.

పారిశుధ్య కాంట్రాక్టర్‌ను తొలగించాలి: సీఐటీయూ

పారిశుధ్య కార్మికుల చేత బండచాకిరి చేయించుకుంటూ కనీస వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న ఏజన్సీని వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు డిమాండ్‌ చేశారు. జీజీహెచ్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మే, జూన్‌ నెల వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. వేతనాల గురించి ప్రశ్నించినప్పుడల్లా ఇంకా బడ్జెట్‌ రాలేదని జవాబు చెబుతున్నారని, దీనికి కార్మికులు బాధ్యత వహించాలా అని ప్రశ్నించారు. జీజీహెచ్‌లో పారిశుధ్య విభాగంలో 240 మంది కార్మికులు పని చేస్తున్నారని, వీరిలో ఎక్కువగా మహిళలు ఉన్నారని తెలిపారు. సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని, కార్మికులు విధులకు హాజరవడానికి రవాణా ఖర్చులకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సీఐటీయూ నగర కన్వీనర్‌ టి.మహేష్‌ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా వేధించడం దారుణమని విమర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పీఎఫ్‌, ఈఎస్‌ఐ గుర్తింపు కార్డులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఏజన్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు నెలలుగా వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని అధికారులు ఇప్పుడు రాయబారాలు చేయడం ఏమిటని యూనియన్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు విజయమ్మ, యూనియన్‌ నాయకులు సుబ్బారావు, జాలమ్మ, సీపీఐ నాయకులు కొత్తకోట వెంకటేశ్వరరావు, ఎంఏ సాలార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement