ఒంగోలు సిటీ: డీసీసీఏపీ, డీఏసీఏల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ‘అమరావతి ఇన్‌క్లూజివ్ క్రికెట్ కప్–2026’ టోర్నీకి ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి శారీరక దివ్యాంగ క్రికెటర్ల ఎంపిక పోటీలు ఈ నెల 31న నిర్వహించనున్నారు. ఒంగోలులోని సీఎస్‌ఆర్ శర్మ కళాశాల మైదానంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఎంపిక పోటీ ఉంటుందని అసోసియేషన్ జిల్లా కన్వీనర్ జి.సుబ్బయ్య తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ సొంత క్రికెట్ కిట్‌తో పాటు ఆధార్, సదరమ్ సర్టిఫికెట్, యూడీఐడీ కార్డుల జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో హాజరు కావాలని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వివరాలకు 80969 29907, 91335 03822ను సంప్రదించాలని కోరారు.
అద్దంకి: పట్టణంలో బైకు చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులకు ఎనిమిది నెలల జైలు శిక్ష పడినట్లు సీఐ సుబ్బరాజు మంగళవారం తెలిపారు. గత ఏడాది జూలై 19న స్థానిక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద తన బైకు చోరీకి గురైందని తోటకూర నంది కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా వినుకొండకు చెందిన కె.వెంకటసాయి, కె.సాయి కృష్ణను పోలీసులు నిందితులుగా గుర్తించి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారు నేరం అంగీకరించడంతో కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అఖిల వారికి ఎనిమిది నెలల చొప్పున జైలు శిక్ష విధించారు. అనంతరం నిందితులను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ వివరించారు.
● పెద్దదోర్నాల మండలం
కటకానిపల్లెలో ఘటన
పెద్దదోర్నాల: మండల పరిధిలోని కటకానిపల్లెలో 60 వ్యవసాయ బోర్లకు చెందిన విద్యుత్ కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. మంగళవారం వేకువజామున విద్యుత్ సరఫరా కాగానే పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు.. బోర్ల వద్ద వైర్లను కత్తిరించి ఉండటాన్ని గమనించారు. వ్యవసాయ బోర్లతో పాటు గ్రామానికి తాగునీరు అందించే బోర్ల వైర్లను సైతం దుండగులు అపహరించారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో కేబుల్స్ చోరీ కావడం రైతుల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై బాధిత రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పెద్దదోర్నాల: ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఐనముక్కల కొండారెడ్డి కాలనీ సమీపంలో కర్నూలు–గుంటూరు రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై వెంకట రమణయ్య కథనం ప్రకారం.. యడవల్లికి చెందిన దూదేకుల మహబూబ్ పీరా(46) ద్విచక్ర వాహనంపై దోర్నాల వైపు వస్తుండగా ఐనముక్కల వద్ద అదుపుతప్పి బోల్తా పడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన 108 సిబ్బంది సయ్యద్ భాషా, శ్రీనివాసులు వెంటనే అతడిని పెద్దదోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సారావుపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివాహిత హత్య కేసులో నలుగురు అరెస్టు
కనిగిరిరూరల్: వివాహిత హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం రాత్రి తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. కనిగిరిలోని అర్బన్ కాలనీకి చెందిన ప్రతిభా భారతి (33) మృతికి కారణమైన భర్త గంటా పీటర్ ప్రమోద్ కుమార్, అతని అన్న, మరో ఇద్దరిని మంగళవారం ఉదయం డీఎస్పీ ఎం శ్రీధర్, ఎస్సై జి.సందీప్ తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 10 వరకు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.


