దోచుకో.. పంచుకో.. తినుకో.. | - | Sakshi
Sakshi News home page

దోచుకో.. పంచుకో.. తినుకో..

Jul 29 2026 2:04 AM | Updated on Jul 29 2026 2:04 AM

దీక్షా శిబిరంలో కూర్చున్న మాజీ మంత్రి సురేష్‌

సంఘీభావం తెలుపుతున్న జంకె వెంకటరెడ్డి

మార్కాపురం: రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని మాయమాటలు చెప్పిన కూటమి నేతలు.. గద్దెనెక్కిన తర్వాత ‘డీపీటీ’(దోచుకో.. పంచుకో.. తినుకో) విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, కొండేపి ఇన్‌ఛార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ధ్వజమెత్తారు. మార్కాపురంలో డాక్యుమెంట్‌ రైటర్లు తమ సమస్యల పరిష్కారం కోసం తొమ్మిది రోజులుగా చేస్తున్న సమ్మెకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ.. బ్రిటీష్‌ కాలం నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుస్తున్న డాక్యుమెంట్‌ రైటర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రిజిస్ట్రార్‌ కార్యాలయాలను పీపీపీ (పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌) విధానంలోకి తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. వెంటనే 396 జీవోను ఉపసంహరించుకోవాలన్నారు. మెడికల్‌ కళాశాలలు, జీజీహెచ్‌లను ఇప్పటికే పీపీపీలోకి తెచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ శాఖను కూడా ఆ దిశగా తీసుకెళ్లడం దారుణమన్నారు. పీపీపీ విధానం వల్ల ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని, ‘మాకింత ఇవ్వు.. మిగిలింది నువ్వు తీసుకో’ అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే లేఖరుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సమ్మెకు జంకె, ఏఐటీయూసీ మద్దతు

డాక్యుమెంటు రైటర్ల పెన్‌డౌన్‌ సమ్మెకు వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి సంఘీభావం ప్రకటించి, ప్రభుత్వం వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌ కూడా సమ్మెకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు టి.సుబ్బారావు, స్టార్‌ మస్తాన్‌, ప్రకాష్‌, గోవర్ధన్‌ పాల్గొన్నారు.

ఇదే చంద్రబాబు ప్రభుత్వ విధానం.. సంపద సృష్టి బూటకం

దస్తావేజు లేఖరుల సమ్మెలో మాజీ మంత్రి సురేష్‌ ధ్వజం

396 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే జంకె, ఏఐటీయూసీ నేత రవీంద్రనాఽథ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement