ముమ్మాటికీ అరకొర ప్రభుత్వమే | - | Sakshi
Sakshi News home page

ముమ్మాటికీ అరకొర ప్రభుత్వమే

Jul 1 2026 12:34 AM | Updated on Jul 1 2026 12:34 AM

వెలిగొండ ప్రాజెక్టుకు చేయాల్సింది ఎక్కువ.. కేటాయింపులు తక్కువ ప్రకటనలతో మభ్యపెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం అరకొర నిధులతో ప్రాజెక్టు పూర్తయ్యేనా విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

సింగరాయకొండ: చంద్రబాబు ప్రభుత్వం అత్తెసరు..అరకొర ప్రభుత్వమేనని అటు పథకాల అమలులో, ఇటు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటంలో అది రుజువైందని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆరోపించారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్‌ సురేష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు వస్తున్నారు వెళుతున్నారే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని ఎప్పుడు ప్రాజెక్టు పూర్తిచేస్తారో మాత్రం చెప్పరని ఎద్దేవా చేశారు. గతంలో 2014–19 మధ్య సంక్రాంతికి ప్రారంభం అనేవారని, ఇప్పుడేమో ఆగస్టులో నీరు వదులుతాం అని చెబుతున్నారని అది ఏ సంవత్సరమో మాత్రం చెప్పరని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టులో ప్రధాన అంశం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీఅని, 2018 సంవత్సరం రికార్డు ప్రకారం 18 ఏళ్లు దాటిన నిర్వాశితులు 7,555 మంది ఉండగా వారికి రూ.905 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని చెప్పారు. అదే ప్రస్తుతం పెరిగిన జనాభా ప్రకారం లబ్ధిదారుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండగా సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. కానీ చంద్రబాబు కేవలం 2,351 మందికి రూ.300 కోట్లు మాత్రమే నిధులు కేటాయించారని, 2018 లెక్కల ప్రకారం కేవలం 30 శాతం మంది నిర్వాశితులకు మాత్రమే ఆ నిధులు చెల్లిస్తారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రాజెక్టు పరిధిలో 11 ముంపు గ్రామాలు ఉన్నాయని వీరికి ఒన్‌టైమ్‌ ప్యాకేజీ ఇస్తామని ప్రకటించినా అందరికీ అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రాజెక్టులో ప్రధానంగా హెడ్‌ రెగ్యులేటర్‌, టన్నెల్‌ లైనింగ్‌, అప్రోచ్‌ ఛానల్‌, తూర్పు మెయిన్‌ కెనాల్‌ పనులు పూర్తి కాలేదన్నారు. ఎంతసేపటికీ తీగలేరు మెయిన్‌ కెనాల్‌, గొట్టిపడియ మెయిన్‌ కెనాల్‌ పూర్తి అయిందని చెబుతున్నారని ప్రాజెక్టులో అతి ముఖ్యమైన టీ 5 అయిన తీగలేరు కెనాల్‌లో అంతర్భాగమైన చిన్న కండలేరు కెనాల్‌ ఊసేలేదన్నారు. ఈ కెనాల్‌ ద్వారా పుల్లలచెరువు మండలంలో 19 గ్రామాల్లోని 14,500 ఎకరాల ఆయకట్టుకు నీరు సరఫరాా అవుతుందని, కానీ ఈ కూటమి ప్రభుత్వం దాని ఊసే చెప్పటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ కెనాల్‌కు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న 2022వ సంవత్సరంలో రూ.83.78 కోట్లు కేటాయించటంతో పాటు పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం టెండర్‌ పిలువలేదని, ఒక్క ఇటుక కూడా పెట్టలేదని ఆరోపించారు. ఇన్ని పనులు ఉంటే ఆగస్టుకు పూర్తవుతుందని ఎలా చెబుతారని ప్రశ్నించారు. జగనన్న ప్రభుత్వం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే 2024–26 లో చంద్రబాబు ప్రభుత్వం కేవలం వెయ్యి కోట్లు ఖర్చు చేసిందని దీనిలోనే రూ.300 కోట్లు ఆర్‌అండ్‌ ఆర్‌ ప్రాజెక్టు నిధులు కలిసి ఉన్నాయని విమర్శించారు.

ప్రభుత్వ పథకాలకు అరకొర నిధులు:

చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ పథకాలకు అరకొర నిధులు కేటాయించిందని, ఇందుకు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పెన్షన్‌ పథకాలే నిదర్శనమన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పటి వరకు రూ.27 వేల కోట్లకు గాను కేవలం రూ.12 వేల కోట్లు ఖర్చు చేశారని, తల్లికి వందనం పథకానికి రూ.13 వేల కోట్లకు గాను రూ.10 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. కొత్త పెన్షన్ల కోసం రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది వృద్ధులు ఎదురుచూస్తున్నారని విమర్శించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, చింతపల్లి హరిబాబు, పిన్నిక శ్రీనివాసరావు, జిల్లా మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ సుల్తాన్‌, నియోజకవర్గ బూత్‌ కమిటీ అధ్యక్షుడు కే మధు, గ్రామ అధ్యక్షుడు షేక్‌ కరీం, షేక్‌ అల్లాభక్షు, దాసరి శేషయ్య, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement