కూటమి నాయకులు తేనెపూసిన కత్తులు | - | Sakshi
Sakshi News home page

కూటమి నాయకులు తేనెపూసిన కత్తులు

Jul 1 2026 12:34 AM | Updated on Jul 1 2026 12:34 AM

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల విమర్శ

సింగరాయకొండ: కూటమి ప్రభుత్వంలో నాయకులు తేనెపూసిన కత్తిలాంటి వాళ్లని, క్రెడిట్‌ చోరీ చేయటమే వీళ్ల నైజం అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ఆరోపించారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. శ్యామల మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమైన వెలిగొండ ప్రాజెక్టుకు వైఎస్సార్‌ పునాది వేస్తే జగనన్న ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి ప్రధాన పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగిలిన అరకొర పనులు పూర్తి చేయటానికి కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.900 కోట్లు అవసరమైతే కేవలం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. క్రెడిట్‌ చోరీలో చంద్రబాబుకు సాటి ఎవరూ లేరన్నారు. మంత్రి స్వామి నియోజకవర్గంలో లా అండ్‌ ఆర్డర్‌ సక్రమంగా లేదని ఆరోపించారు. రేషన్‌ బియ్యం మాఫియా, మైనింగ్‌ మాఫియా ఉందని అలాగే పొగాకు రైతు ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే మంత్రి స్వామి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. పిఠాపురంలో దళిత మహిళకు కులం అంటగట్టి ఆమె జీవితాన్ని నాశనం చేశారన్నారు. ఈ ప్రభుత్వం పై సామాన్య ప్రజల్లో నైరాశ్యం నెలకొందని, మార్పు కోరుకుంటున్నారన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement