విధి ఆడిన వింత నాటకం! | - | Sakshi
Sakshi News home page

విధి ఆడిన వింత నాటకం!

Jul 1 2026 12:34 AM | Updated on Jul 1 2026 12:34 AM

రెండుసార్లు పాము కాటేసినా మృత్యుంజయుడై.. మూడోసారి పాముకాటుకే బలి

బల్లికురవ: మృత్యువు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. రెండుసార్లు పాముకాటును జయించి ’మృత్యుంజయుడు’ అనిపించుకున్న ఒక రైతు, చివరకు మూడోసారి అదే పాముకాటుకు బలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నక్కబొక్కలపాడు గ్రామానికి చెందిన ధూళిపాళ్ల వీరాంజనేయులు(55) వ్యవసాయం చేస్తూ, పాల సేకరణ ఏజెంట్‌గా అందరికీ సుపరిచితులు. గత ఆరు నెలల కాలంలోనే మూడుసార్లు పాముకాటుకు గురయ్యారు. తొలిసారి తన సుబాబుల్‌ తోటలో, రెండోసారి ఇంటి ముందు కాలువ శుభ్రం చేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. సమయానికి వైద్యం అందడంతో రెండుసార్లూ మృత్యువును జయించాడు. వైద్యుల సలహాతో క్రమం తప్పకుండా వాకింగ్‌ చేస్తున్న ఆయన మంగళవారం ఉదయం గ్రామంలోని అంకమ్మ గుడి వైపు వెళ్తున్నాడు. ఈ సమయంలో మూడోసారి పాము ఆయనను కాటేసింది. హుటాహుటిన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పారు. 108లో మార్టూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆయన కన్నుమూశారు. ఒకే వ్యక్తికి ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు పాము కాటేయడం, చివరకు ప్రాణం పోవడం గ్రామంలో విషాదఛాయలు నింపింది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్య, కుమారుడు, కుమార్తె రోదనలు మిన్నంటాయి. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement