మాట్లాడదామని పిలిచి.. మహిళపై కత్తితో దాడి | - | Sakshi
Sakshi News home page

మాట్లాడదామని పిలిచి.. మహిళపై కత్తితో దాడి

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

అర్ధవీడు: ‘సమస్యేదో ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం రండి’ అంటూ నమ్మించి పిలిచి.. ఒక మహిళపై కత్తితో ఘాతుకానికి తెగబడిన సంఘటన అర్ధవీడు మండల పరిధిలోని మాగుటూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలి భర్త, వైఎస్సార్‌ సీపీ బీఎల్‌ఏ యాబాకుల వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం యాబాకుల రజిత (38) ఇంటి ముందర శుభ్రం చేసి నీళ్లు చల్లుతుండగా, పక్కనే ఉండే ఓబినేని వెంకటలక్షమ్మతో చిన్నపాటి వివాదం జరిగింది. అనంతరం రజిత, వెంకటేశ్వరుర్లు ఉపాధి హామీ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో నాలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ‘సమస్య పరిష్కరించుకుందాం రండి’ అని వారిని తన ఇంట్లోకి పిలిచాడు. రజిత ఇంట్లోకి వెళ్లగానే ముందస్తు పథకం ప్రకారం తలుపులు వేశారు. ఆమె భర్త వెంకటేశ్వర్లు లోపలికి రాకుండా వరండా ఐరన్‌ గ్రిల్స్‌ మూసివేశారు. అదే సమయంలో ఇంట్లో మాటు వేసిన ఓబినేని ప్రవీణ్‌కుమార్‌, కేసనపల్లి వెంకటేశ్వర్లు, సుబ్బారావు, వెంకటలక్షమ్మ ఒక్కసారిగా రజితపై దాడికి పాల్పడ్డారు. కత్తితో ఆమె వీపు, మెడ భాగాలపై నాలుగు సార్లు విచక్షణారహితంగా పొడిచారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రజిత భర్తతోపాటు గిద్దలూరు సరోజ అనే మహిళను సైతం నిందితులు గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన రజితను స్థానికులు 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని అర్ధవీడు పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఓబినేని ప్రవీణ్‌కుమార్‌, కేసనపల్లి వెంకటేశ్వర్లు, సుబ్బారావు, వెంకటలక్షమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అడ్డుకోబోయిన భర్త, మరో మహిళకు గాయాలు నలుగురు నిందితులపై కేసు నమోదు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement