కందుకూరు అధికార పార్టీలో రెండు వర్గాల మధ్య విభేదాలు బహిర్గతం ఎమ్మెల్యే ఇంటూరికి వ్యతిరేకంగా ఉన్న అసంతృప్త నాయకులు, కార్యకర్తలను సమీకరించే పనిలో మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వచ్చే ఎన్నికల్లో తన సోదరుడిని బరిలో దింపాలని తెరవెనుక ప్రయత్నాలు దివి శివరాం వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే ఇంటూరి వర్గం, అధిష్టానానికి ఫిర్యాదులు
కందుకూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు ఎప్పటికప్పుడు బహిర్గతమవుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వర్గాల మధ్య అంతర్గత పోరు మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు నుంచే ఇంటూరి నాగేశ్వరరావు
వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ వచ్చిన శివరాం, తిరిగి మరోసారి అదే స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. నియోజకవర్గంలో ఇంటూరి
నాగేశ్వరరావుకి చెక్ పెట్టాలనే వ్యూహంతో తెరవెనుక పావులు కదుపుతూనే సీనియర్‌లను అవమానిస్తున్నారంటూ బహిరంగంగానే ప్రకటించారు. అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఎమ్మెల్యే ఇంటూరి వర్గం కూడా అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపుతున్నట్లు సమాచారం.
కందుకూరు:
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు మధ్య అంతర్గత పోరు నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. వారి మధ్య ఎన్నికల ముందు నుంచే విభేదాలున్నాయి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొంతకాలం మౌనంగా ఉన్న శివరాం తిరిగి ఇటీవల కాలంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కందుకూరు పట్టణంలో తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే చెప్పుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు చిరకాలం గుర్తుండిపోయే అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేశారని, దశాబ్దాల పాటు అభివృద్ధి చేస్తేనే ప్రస్తుతం పట్టణంలో కొంత మార్పు కనిపిస్తోందన్నారు. తన తండ్రి దివి కొండయ్యచౌదరి, మానుగుంట ఆదినారాయణరెడ్డి, మహీధర్‌రెడ్డి, తాను గతంలో చేసిన అభివృద్ధి పనులు గుర్తు లేవా అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు మొత్తం అభివృద్ధి తానే చేశానని చెప్పుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. నలుగురు వైఎస్సార్ సీపీ వాళ్లను పార్టీలో చేర్చుకుని అదే బలం అనుకుంటే పొరపాటు అన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని గుర్తించాలంటూ ప్రత్యక్షంగానే ఎమ్మెల్యే వ్యవహార శైలిని తప్పుపట్టారు. అలాగే నియోజకవర్గంలో గంజాయి విక్రయాలపై కూడా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ ప్రకటించారు. ఇలా ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే ఇంటూరి తీరుపై మాజీ ఎమ్మెల్యే ఫైర్ అవుతూనే ఉన్నారు.
అసంతృప్త నాయకులు, కార్యకర్తలను కూడగట్టేందుకు జోరుగా ప్రయత్నాలు
పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సరైన గుర్తింపు లేకపోవడం, కాంట్రాక్టు పనులు, పదవుల్లో ప్రాధాన్యత దక్కకపోవడం, ఎమ్మెల్యే వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ పార్టీకి కొంత దూరంగా ఉన్న నాయకులు, కార్యకర్తలను తనవైపు తిప్పుకునేందుకు దివి శివరాం కొంత కాలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీనికి అనుగుణంగా పార్టీలో ప్రాధాన్యత లేని నాయకులు శివరాం దగ్గరకి రావాలంటూ ఆయన వర్గం వాట్స్‌యాప్ గ్రూపుల్లో ప్రకటించడం గమనార్హం. అదే సందర్భంలో అసంతృప్త నాయకుల కోసం ఓ గ్రూపును కూడా క్రియేట్ చేశామంటూ చెప్తున్నారు. అందరూ కలిసి వస్తే శివరాం ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానాన్ని కలిసి బాధలు చెప్పుకుందామని, నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితిని పెద్దలకు చెప్పుకుందామంటూ సమీకరించే పనిలో ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం అధికార పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది.
శివరాంపై అధిష్టానానికి ఫిర్యాదులు
అదే సందర్భంలో శివరాం ప్రయత్నాలకు చెక్‌పెట్టే పనిలో ఎమ్మెల్యే ఇంటూరి వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు, పార్టీలో విభేదాలు సృష్టించేలా శివరాం వ్యవహరిస్తున్నారంటూ పార్టీ అధిష్టానానికి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపుతున్నట్లు సమాచారం. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎటువంటి చర్యలు లేవనే చెప్పాలి. ఇలా పార్టీలో రెండు వర్గాల ఆధిపత్య పోరుతో ప్రస్తుతం అధికార పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశమవుతున్నాయి.
తెరవెనుక
రాజకీయ వ్యూహం...
ఇటీవల కాలంలో శివరాం పార్టీలో తన స్పీడ్ పెంచడం పట్ల భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందని ఆ వర్గం చెప్పుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి టికెట్ దక్కకుండా చేయడంతో పాటు, తన సోదరుడైన దివి రవీంద్రనాఽథ్‌ని ఎన్నికల బరిలో దింపేందుకు ఇప్పటి నుంచి తెరవెనుక పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఇటీవల రవీంద్రనాఽథ్ పట్టణంలో సొంత ఇంటిని నిర్మించుకోవడం, ఇక నుంచి తాను ఇక్కడే ఉంటానని ప్రకటించడం చర్చనీయాంశమైంది. కోల్పోయిన దివి వంశ ప్రాబల్యాన్ని మళ్లీ నిలబెట్టాలనే పట్టుదలలో భాగంగా శివరాం తెరవెనుక కథ నడుపుతున్నారు. అందుకు అనుగుణంగా ఇటీవల కాలంలో నియోజకవర్గంలో శుభకార్యాలు, ఇతరత్రా కార్యక్రమాలకు తన సోదరుడు రవీంద్రనాఽథ్‌ను వెంటబెట్టుకుని శివరాం తిరుగుతున్నారు. అంటే పార్టీలో కార్యకర్తలు, నాయకులకు తన సోదరుడిని పరిచయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొదటి నుంచి తన వెంట వర్గాన్ని కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ సీనియర్ నాయకుడి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచిచూడాల్సిందే.


