అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సిబ్బంది ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడంలో వివక్ష
మార్కాపురం టౌన్:
సర్ సర్వేలో కొందరు బీఎల్‌ఓలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 15 నుంచి ప్రారంభమైన సర్ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంటలో బీఎల్‌ఓ మొదటి రోజైన సోమవారం అధికార పార్టీ నాయకులకు మాత్రమే ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు. ఈ విషయాన్ని మాజీ వైస్ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నేత బాలయ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి గ్రామస్తుల్లో కొందరికి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు. ఇక గజ్జలకొండ, గొట్టిపడియ, నాగులవరం గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో బీఎల్‌ఓలు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వలేదని గ్రామస్తులు తెలిపారు. ఎన్యుమరేషన్ పూర్తిచేసే ఫారంలో, 2002, 2025 ఓటర్ల జాబితా సవరణ చూసి ఫారం నింపే సమయంలో ఎటువంటి ఫారాలు బీఎల్‌ఓకు అందజేయాలనే విషయంలో కూడా పలు చోట్ల గందరగోళం నెలకొంది. ఎన్యుమరేషన్ ఫారాన్ని పూర్తిచేసి బీఎల్‌ఓకు ఇచ్చిన తరువాత ఓటరుకు అక్‌నాలెడ్జ్‌మెంటు స్లిప్ ఇచ్చే విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో ఓటర్లకు, బీఎల్‌ఓలకు మధ్య వాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలువురు బీఎల్‌ఓలు తమకు కేటాయించిన గ్రామాల్లో ముందుగా అధికార పార్టీ నేతల వద్దకు వెళ్లి వారిని తీసుకుని ఓటర్ల ఇంటి వద్దకు వెళ్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘సర్’ పట్ల కొరవడిన అవగాహన
● మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
పొదిలి: ఓటర్ల పూర్తి స్థాయి ప్రక్షాళనకు సంబంధించి సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు, ఓటర్లలో పూర్తి స్థాయి అవగాహన కొరవడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సర్ పట్ల పూర్తి స్థాయి అవగాహన, విస్తృత స్థాయి ప్రచారం కల్పించాలని కోరారు. మార్కాపురం నియోజకవర్గంలో 257 మంది బీఎల్‌ఓలు ఉన్నారని, అయితే వారిలో కొందరు అవగాహన లోపించి పలు రకాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో బీఎల్‌ఏలలో ఓటర్లలో అయోమయం నెలకొందన్నారు. ఇప్పుడిప్పుడే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, బాలారిష్టాలు అనే విధంగా వ్యవహారం ఉన్నా, గడువు తీరితే ఇబ్బంది వస్తుందన్నారు.
సర్ ప్రక్రియకు సంబంధించి కమిషన్ ఆదేశాలను ఏకరూపంగా అనుసరించటం ద్వారా ఎవరికీ సమస్య లేకుండా ఉంటుందన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు కొంత మంది బీఎల్‌ఓలు నింపడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫారం నింపటం మాకు సంబంధం లేదని బీఎల్‌ఓలు కొందరు సమాధానం చెబుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. వారికి ఎన్యుమరేషన్ ఫారాలు నింపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఐడీ కార్డులు ఎవరి ఇష్టానుసారం వారు అడుగుతున్నారని, ఏ కేటగిరీకి ఎన్ని ఐడీ కార్డులు ప్రూఫులు అవసరమో అన్ని మాత్రమే తీసుకునేలా బీఎల్‌ఓలకు ఆదేశాలివ్వాలన్నారు. రిసిప్టులు ఇవ్వకుండా, రెండు ఫారాలు బీఎల్‌ఓలే స్వాధీనం చేసుకుంటున్నారని, అలాంటప్పుడు ఓటర్ల వద్ద ఆధారం ఏమీ ఉండదు కదా అని ఆయన ప్రశ్నించారు. రసీదులు ఇచ్చేలా బీఎల్‌ఓలకు సూచనలు ఇవ్వాలన్నారు. మరి కొందరు బీఎల్‌ఓలు కార్యాలయానికి వచ్చి అవసరమైన ఫారాలు తీసుకెళ్లాలని చెబుతున్నారని, అలా కార్యాలయాలకు వెళ్లాలంటే ఓటర్లకు, బీఎల్‌ఏలకు సమస్యగా మారుతుందని చెప్పారు. దీంతో ప్రక్రియ వేగవంతం తగ్గుతుందన్నారు. అధికారులైనా, బీఎల్‌ఓలైనా బీఎల్‌ఏలను అందరినీ ఒకే రకంగా చూడాలని, బీఎల్‌ఏలకు వచ్చే అనుమానాల నివృత్తి కోసం, సంబంధిత అధికారి ఫోన్ నంబర్ ఏదైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


