అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్‌

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి నిధులు లేవనడం అన్యాయం ఐవీఆర్‌ ఫోన్లకు ప్రజలు సమాధానం ఇవ్వకపోతే అంగన్‌వాడీలకు మెమోలా.. అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ

ఒంగోలు టౌన్‌: స్పీడ్‌ ఆఫ్‌ బిజినెస్‌ డూయింగ్‌ పేరుతో ఎకరా భూమి 99 పైసలకే ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రం నిధులు లేవని ఒట్టి చేతులు చూపుతోందని, లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ తీవ్రంగా విమర్శించారు. అంగన్‌వాడీల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జూలై 10వ తేదీన చలో కలెక్టరేట్‌ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో అంగన్‌వాడీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్‌ ఇంద్రావతి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అంగన్‌వాడీలకు 42 రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామన్న హామీని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించడం లేదని చెప్పారు. మినీలను మెయిన్‌ చేయడం యూనియన్‌ ఫలితంగానే జరిగిందన్నారు. గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఇస్తున్నట్లు గ్రాట్యూటీని ఏపీలో కూడా ఇవ్వాలని, ఈ విషయం గురించి మార్చిలో చలో విజయవాడ సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 5 సంవత్సరాల్లోపు చిన్నారులను ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్చుకోకుండా జీఓ ఇవ్వాలని, ప్రీ స్కూల్‌ సక్రమంగా అమలయ్యేలా అంగన్‌వాడీలకు ఇతర పనులు అప్పగించరాదని కోరారు. రకరకాల యాప్‌లతో అంగన్‌వాడీలపై ఒత్తిడి పెంచడం వలన అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 10వ తేదీన జరిగే చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం జాయింట్‌ మీటింగ్‌ వేయమని కోరుతున్నా వేయకపోవడం దారుణమన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పారు.

ఐవీఆర్‌ కాల్స్‌కు ప్రజలు ఫోన్‌ ఎత్తక పోయినా, ప్రభుత్వానికి అనుకూలంగా మెసేజ్‌ ఇవ్వకపోయినా అంగన్‌వాడీలకు మెమోలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఫోన్లను ప్రజలు రిసీవ్‌ చేయకపోతే దానికి అంగన్‌వాడీలు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలను వేధించడం మానుకోవాలని కోరారు. సమావేశంలో ధనలక్ష్మి, హేమిమా, క్రాంతి కుమారి, చిన్నమ్మాయి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement