కల్లోల కడలిపై .. ఆకలి వేట | - | Sakshi
Sakshi News home page

కల్లోల కడలిపై .. ఆకలి వేట

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

● ముగిసిన రెండు నెలల విరామం ● నిషేధం తర్వాత సంద్రంలోకి గంగపుత్రులు ● రెండేళ్లుగా కడలి పుత్రుల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం ● వరుస విపత్తులు.. సోనాబోట్ల దాడులతో నష్టపోయిన మత్స్యకారులు ● ఈసారైనా కరుణించు తల్లీ అంటూ పూజలు

● ముగిసిన రెండు నెలల విరామం ● నిషేధం తర్వాత సంద్రంలోకి గంగపుత్రులు ● రెండేళ్లుగా కడలి పుత్రుల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం ● వరుస విపత్తులు.. సోనాబోట్ల దాడులతో నష్టపోయిన మత్స్యకారులు ● ఈసారైనా కరుణించు తల్లీ అంటూ పూజలు

ఆకలి వేట

అపార మత్స్య సంపదకు నిలయమైన సంద్రమే వారికి జీవనాధారం. ఎగసి పడుతున్న అలలకు ఎదురొడ్డి.. ప్రాణాలకు తెగించి బతుకు నావతో ప్రయాణం. వేట సాగితేనే పూట గడవని గంగపుత్రులు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ అలలపై ఆశల వేటకు

సిద్ధమయ్యారు. మత్స్య సంపద వృద్ధి కోసం విధించిన వేట నిషేధం నేటితో ముగిసింది. వేకువ జామునే

గంగమ్మకు పూజలు నిర్వహించారు. వేట సజావుగా సాగాలని వేడుకున్నారు. ప్రతికూల వాతావరణం

నేపథ్యంలో రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు

ఎదుర్కొంటున్నారు. ఈ సారైనా కరుణించు తల్లీ

అంటూ కడలిపుత్రులు సంద్రంలోకి అడుగు పెట్టారు. లంగరు వేసిన బోట్లు తెల్లవారు జామునే తీరానికి చేర్చి సాగర మథనానికి సిద్ధమయ్యారు.

సోమవారం జిల్లాలో తీరం

సందడిగా మారింది.

సింగరాయకొండ: జిల్లాలో రెండు నెలల చేపల వేట నిషేధం తరువాత సోమవారం నుంచి ఎంతో ఆశలతో చేపల వేట ఆరంభమైంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో తొలి రోజు ఆశాజనకంగా ఉందని మత్స్యకారులు సంబర పడ్డారు. ఒక్కో బోటుకు రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పైగా విలువజేసే చేపలు లభించాయని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా చేపల వేట సక్రమంగా రోజుకు ఒక్కసారి మాత్రమే చేపల వేట సాగిస్తూ వస్తున్నారు. ఈ సారైనా గట్టెక్కుతామా అంటూ కోటి ఆశలతో వేట మొదలెట్టారు.

70 కిలో మీటర్లు..39 గ్రామాలు..

జిల్లాలో సుమారు 70 కిలోమీటర్ల సముద్రతీరం విస్తరించి ఉంది. సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు, గుడ్లూరు, ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల పరిధిలో సుమారు 39 మత్స్యకార గ్రామాలున్నాయి. మొత్తం 50 వేల జనాభా, సుమారు 5,500 గృహాలు ఉండగా చేపల వేటపై ఆధారపడి సుమారు 12 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. జిల్లాలో సుమారు 2,303 బోట్లు ఉండగాా వాటిలో సుమారు 1,661 మోటరైజ్డ్‌ బోట్లు, 642 నాన్‌ మోటరైజ్డ్‌ బోట్లు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంగపుత్రులకు గడ్డురోజులు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మత్స్యకార భరోసా ఎగ్గొట్టింది. రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. మూడో ఏడాది రకరకాల నిబంధనలతో ఇబ్బందులకు గురిచేసిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

రెండేళ్లుగా అన్నీ ఒడిదుడుకులే..

వరుస ప్రకృతి విపత్తులు ఒకవైపు...తమిళనాడు కడలూరు, పాండిచ్చేరి కరెక్కల్‌ సోనాబోట్ల దాడులతో రెండేళ్లుగా చేపల వేట ఆశాజనకంగా లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ తుఫాన్‌లు, అల్పపీడనాలు రావటంతో వేట సక్రమంగా సాగలేదని, ఒకవేళ వేటకు వెళ్లినా మత్స్య సంపద సక్రమంగా పడలేదని, చివరికి ఖర్చులు కూడా రాలేదు. తమిళనాడు రాష్ట్రం కడలూరు, పాండిచ్చేరి కరైకల్‌కు చెందిన సోనాబోట్లు తీరంలో విధ్వంసం సృష్టిస్తూ మత్స్యసంపదను కొల్లగొడుతున్నాయి. ప్రాణాలకు తెగించి పాండిచ్చేరి కరైకల్‌కు చెందిన నాలుగు సోనాబోట్లు పట్టుకుని జువ్వలదిన్నె హార్బర్‌లో ఉంచామని, అయితే వాటిని టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు కుట్రలు చేసి వదిలేశారని ఆరోపించారు. వారితో పెద్ద ఎత్తున డీల్‌ కుదుర్చుకుని బోట్లను వదిలేసి ప్రకాశం, నెల్లూరు జిల్లాల మత్స్యకారులకు తీరని ద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మత్స్యకార పెద్దలు మూడు దఫాలుగా సమావేశాలు నిర్వహించి దోషులను గుర్తించినా ప్రభుత్వం మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మత్స్యకారులు రగిలిపోతున్నారు.

పాలేల్లో ప్రత్యేక పూజలు

మత్స్య సంపద వృద్ధి కోసం ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి 61 రోజుల పాటు ప్రభుత్వం చేపల వేటకు నిషేధం విధించింది. నిషేధకాలం ముగియడంతో సోమవారం తెల్లవారుజాము నుంచి తీరంలో సందడి మొదలైంది. తమను చల్లగా కాపాడు. తిరిగి వచ్చేలా చూడమ్మా.. అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అదే విధంగా మత్స్య సంపదతో సిరిసంపద పెరిగేలా చూడాలని కోరుకున్నారు. మత్స్యకార మహిళలు సముద్రంలో కుంకుమ, పసుపు సమర్పించారు..కొత్తబోట్లు, వలలు కొనుక్కున్న మత్స్యకారులు మాత్రం తీరంలో పూజలు చేసుకుని టెంకాయ కొట్టి వేట ప్రారంభించారు. రెండేళ్లుగా వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో చేపల వేట సక్రమంగా సాగలేదని గత సంవత్సరం అయితే చేపల వేట మరీ దారుణంగా ఉందని మత్స్యకారులు వాపోయారు. ఈసారైనా కరుణించమ్మా అంటూ గంగపుత్రులు వేడుకున్నారు. తొలి రోజు శుభసూచకంగా ఉందని, మత్స్య సంపద పుష్కలంగా లభించిందని మత్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత శనివారం నాగూర్‌మీరాసాహెబ్‌కు పూజలు నిర్వహించి జెండాలు పాలెంలో ఊరేగించారు. వారం రోజుల ముందునుంచే బోట్లు, వలలకు మరమ్మతులు చేసుకుని వేటకు సిద్ధమయ్యారు. తమిళనాడు బోట్ల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక సెక్యూరిటీ బోటును ఏర్పాటు చేసినట్టు రామాయపట్నం మైరెన్‌ సీఐ శివన్నారాయణ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement