గొర్రెల కాపరులపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తేవాలి వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ కలెక్టరేట్ వద్ద బీసీల భారీ నిరసన ప్రదర్శన
ఒంగోలు వన్‌టౌన్: రాష్ట్రంలో బీసీల ప్రాణాలకు, ఆస్థులకు రక్షణ లేకుండా పోయిందని ఈదుమూడిలో గొర్రెల కాపరులపై అగ్రకులస్థుల దాడే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఈనెల 7వ తేదీన గొర్రెలు మేపుకుంటున్న యాదవ యువకులపై దాడి చేసిన అగ్రకులస్తులను వెంటనే అరెస్టు చేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ధర్నాలో నాగార్జున యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గొర్రెల కాపరులపై చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నాయకులు టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారని, ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే సీఐ శేషగిరిరావు నిందితులకు వత్తాసుపలుకుతూ మాట్లాడటమే కాకుండా ఈ దాడిపై చిన్న కేసు నమోదు చేసి..నిందితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితులపైనే కేసు కట్టారన్నారు. జరిగిన సంఘటనపై జ్యుడీషియరీ విచారణ నిర్వహించాలన్నారు. ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న 139 బీసీ కులాల సంఘ చైర్మన్ మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ గొర్రెల కాపరులపై అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరచారన్నారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సీఐ శేషగిరిరావు అగ్రకుల నిందితుల ఫిర్యాదుతో బాధితులపైనే కేసు నమోదు చేశారని మండిపడ్డారు. 139 బీసీ కులాల జేఏసీ నాయకుడు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ అగ్రకుల వ్యక్తులు చేసిన దాడిలో మధు, అనిల్ అనే ఇద్దరు గొర్రెల కాపరులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరారన్నారు. బాధితులు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వర్లు, అంకినీడు, కావూరి నాగార్జున, ఉప్పల సుబ్రహ్మణ్యం, బాచిన రంగారావు, ఉప్పల వెంకట్రావు, ఉప్పల ప్రసాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, అగ్రకులాల వారికి కొమ్ముకాస్తూ సీఐ శేషగిరిరావు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గొర్రెలను చెల్లాచెదురు చేయడమే కాకుండా, గొర్రెల కాపరులను కాళ్లతో పదేపదే తంతూ, అసభ్యంగా దూషించారని పేర్కొన్నారు. ఇప్పటికీ కొన్ని గొర్రెలు కనిపించకుండా పోయాయన్నారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ గొర్రెల కాపరలపై దాడి చేసిన దుర్మార్గులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఐ శేషగిరిరావును సస్పెండ్ చేయాలన్నారు. ఈదుముడి గ్రామంలో అన్యాక్రాంతమైన మేత భూములను వెలికి తీసి గొర్రెల కాపరులకు, పశు పోషకులకు హక్కు కల్పించాలని, 50 ఏళ్లు నిండిన గొర్రెల కాపరులకు, పశుపోషకులకు రూ.6 వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీ రక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా హరి యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కన్వీనర్ బోట్ల రామారావు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు బంకా చిరంజీవి, పీఎల్‌పీ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ పీఏసీ చైర్మన్ కొలుసు మోహన్ యాదవ్, బీసీ రాష్ట్ర నాయకులు యనమల నాగార్జున యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు లాకా వెంగళరావు, హైకోర్టు అడ్వకేట్ వీరు యాదవ్, నర్రావుల శ్రీనివాసరావు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, జీహెచ్‌పీఎస్ నాయకులు పేరం సత్యం, బాధితులు పాల్గొన్నారు.


