పాడుబడిన ఒంగోలు డెయిరీ 45 వేల మంది పాడి రైతుల జీవనోపాధిపై దెబ్బ 2013 నుంచి 2017 మధ్య టీడీపీ పాలకవర్గం అంతులేని అవినీతి రూ.109 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన డెయిరీ దానికి గాను వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.69 కోట్ల మంజూరుకు అనుమతి 2023లో ఉద్యోగుల వీఆర్‌ఎస్‌కు రూ.13.29 కోట్లు, మార్టిగేజ్ రుణాల చెల్లింపునకు మరో రూ.18 కోట్లు విడుదల కోట్లాది రూపాయల విలువ చేసే 6 ఎకరాలు ఆక్రమించిన టీడీపీ నేతలు పీ–4 పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించి చేతులు దులుపుకునే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం
పాపాలు
చీమకుర్తి: ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి వేలాది మంది పాడిరైతులకు ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ఒంగోలు డెయిరీ బ్రాండ్‌తో నిర్వహిస్తున్న ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(పీఎంపీసీఎల్) ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని టాప్ 5 పాలకేంద్రాల్లో ఒకటిగా పేరుగాంచింది. 2015–16 నాటికి అది అత్యధిక స్థాయిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో 125 పాలకేంద్రం సొసైటీల ద్వారా 45 వేల మంది రైతుల సభ్యత్వానికి చేరుకుంది. జిల్లాలోని 7 మిల్క్ కూలింగ్ సెంటర్‌లు అయిన కనిగిరి, కంభం, యర్రగొండపాలెం, దర్శి, తూర్పు గంగవరం, వీఆర్ కోట, కొండమంజులూరు కేంద్రాల నుంచి రోజుకు 3 లక్షల లీటర్లను సేకరించి ఒంగోలు డెయిరీకి పంపించేవారు. 2013లో ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(పీఎంపీసీఎల్)గా పేరు మార్చారు. అప్పటి వరకు అధికారుల చేతుల్లో ఉన్న నిర్వహణ బాధ్యతలు పీఎంపీసీఎల్ చేతికొచ్చాక లాభాల్లో ఉన్న డెయిరీ కాస్త అప్పుల్లో కూరుకుపోయింది. 2013 నుంచి 2017 మధ్య బాధ్యతలను చేపట్టిన అప్పటి తెలుగుదేశం పార్టీకి చెందిన చల్లా శ్రీనివాసరావు చైర్మన్‌గా ఉన్న పాలకవర్గం అవినీతి అక్రమాల కారణంగా లాభాల్లో ఉన్న డెయిరీ నెలకు రూ.90 లక్షల అప్పులు చెల్లించాల్సిన దౌర్భాగ్య స్థితిలోకి చేరుకుంది. కొన్ని మిల్క్ కూలింగ్ సెంటర్‌లలో సొసైటీల ప్రెసిడెంట్‌లుగా ఉన్న వారు, డెయిరీకి పాలకవర్గం ఆధిపత్యం ఉన్న రోజుల్లో పాల ధరలు, వెన్న శాతం ధరలను ఎక్కువ చూపించి డెయిరీకి వచ్చే లాభాలను స్వాహా చేశారు. అవినీతి తార స్థాయికి చేరటంతో అప్పుల పాలై చివరకు ఉద్యోగుల జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. రూ.109 కోట్ల అప్పులున్నట్లు ప్రభుత్వం తేల్చింది. ఈలోపు జిల్లాలోని పాలను సరఫరా చేసే 7 మిల్క్ కూలింగ్ సెంటర్‌లు కూడా ఒక్కొక్కటి మూతపడ్డాయి. చివరకు పీఎంపీసీఎల్ నిర్వహించలేక అప్పులుపాలు కావడంతో మధ్యలో అమూల్ సంస్థ బాధ్యతలను స్వీకరించినప్పటికీ గతంలోని పాలకవర్గం చేసిన అప్పుల ఊబిలోనుంచి బయట పడలేక అమూల్ పక్కకు తప్పుకుంది.
ఒంగోలు డెయిరీకి వైఎస్సార్ సీపీ చేయూత:
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పీఎంపీసీఎల్ డెయిరీని ఆదుకునే క్రమంలో అప్పుగా తేలిన రూ.109 కోట్లకు గాను రూ.69 కోట్లను మంజూరు చేసేందుకు నిర్ణయించింది. దానిలో భాగంగా 2023లో ఉద్యోగుల జీతాలు, వీఆర్‌ఎస్‌ల ద్వారా చెల్లించేందుకు రూ.13.29 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో పాటు మార్టిగేజ్‌లో ఉన్న పీఎంపీసీఎల్ ప్రాపర్టీ డాక్యుమెంట్ల్‌ను విడుదల చేసేందుకు జగన్ ప్రభుత్వం మరో రూ.18 కోట్లను 2023లోనే విడుదల చేసింది. ఇంకా రూ.38 కోట్లను విడుదల చేయాల్సి ఉండగా ఈ లోగా ఎన్నికలు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు అడ్‌హాక్ కమిటీతో కాలం నెట్టుకొస్తోంది. దానిని ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ఎండీ చైర్మన్‌గా, జేసీ, వెటర్నరీ జేడీ, డీడీ డైరెక్టర్‌లుగా అడ్‌హాక్ కమిటీ ఏర్పాటు చేసి కొంతకాలం నెట్టుకొచ్చారు. అప్పులు చెల్లించేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయకపోగా దానిని పునరుద్ధరించే ప్రయత్నాలను పక్కన పెట్టి పీ–4 పద్ధతిలో ఎవరికో ఒకరికి కట్టబెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
శిథిలావస్థలో మిల్క్ ప్లాంట్ మిషనరీ, వాహనాలు:
ఒంగోలు డెయిరీలో పాల ప్యాకెట్లు, వెన్న, జున్ను, మలయ్ లడ్డు, పాలపొడి వంటి పలు రకాల పాల పదార్థాలను తయారు చేయటానికి అవసరమైన రూ.30– రూ.40 కోట్ల విలువైన పరికరాలు మిల్క్‌ప్లాంట్‌లో ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు పాలకేంద్రం వద్దే 30 వేల లీటర్ల పాలను విక్రయించేవారు. రోజుకు 30 టన్నుల పాలపొడిని అక్కడే ఉన్న పౌడర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసేవారు. అలాంటి విలువైన కోట్లాది రూపాయల విలువ చేసే మిషనరీ ఇప్పుడు పూర్తిగా తుప్పుబట్టి పాడైపోయాయి. పాలను సేకరించేందుకు ఉపయోగించిన మూడు ట్యాంకర్‌లు ఇప్పుడు నిరుపయోగంగా మిగిలాయి. అధికారుల నిర్వహణకు ఉపయోగించే 2 జీపులు, 2 పశువుల అంబులెన్స్‌లు, 1 కారు, 2 బైకులు శిథిలావస్థలో ఎందుకూ పనికిరాకుండా పోయాయి. పీఎంపీసీల్ పాలకవర్గం చైర్మన్, డైరెక్టర్‌లు, అధికారులు, పాడి రైతులతో ఏర్పాటు చేసే సమావేశాల కోసం నిర్మించిన పాలక మండలి భవనాలు, సాంకేతిక భవనాలు పూర్తిగా శిథిలావస్థలో దర్శనమిస్తున్నాయి.
పాడుబడిన పాలక భవనం
డెయిరీ ఆస్తుల విలువ రూ.1500 కోట్ల పైమాటే
ఒంగోలు డెయిరీకి చెందిన భూములు మొత్తం 90 ఎకరాలు ఉంది. పేర్నమిట్ట–ఒంగోలు మధ్య కర్నూలు రోడ్డు ఫేసింగ్‌లో డెయిరీ నిర్మించిన 78 ఎకరాల స్థలం, దానికి అనుబంధంగా ఉన్న కొండమంజులూరులో మరో 12 ఎకరాలు ఉన్నాయి. వాటి విలువ దాదాపు రూ.1500 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
దాదాపు 6 ఎకరాల్లో ఆక్రమణలు
ఒంగోలు డెయిరీ ఉన్న ప్రదేశంలో కొంతమంది అక్రమార్కులు సుమారు 6 ఎకరాల వరకు ఆక్రమించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎంట్రెన్స్‌లో తూర్పు వైపు 25 సెంట్లు, ప్లాంట్‌కు వెనుక 11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఒక ఎకరం, వెనుకనే సుబాబులు వేసి ఉన్న ప్రాంతంలో మరో 5 ఎకరాలను అధికార పార్టీకి చెందిన కొందరు ఆక్రమించుకొన్నారు. దానిపై అధికారులు కోర్టుకెక్కారు.
తుప్పుబట్టి ముళ్ల పొదల మధ్య నిరుపయోగంగా మారిన మిల్క్ ట్యాంకర్
పాల పదార్థాలను తయారు చేసే భవనాల దుస్థితి
తుప్పు పట్టిన విలువైన పరికరాలు
తిరిగి తెరిపించేందుకు చర్యలు తీసుకుంటాం
డెయిరీ అప్పులు రూ.109 కోట్లుగా ఉంది. దానికి గాను ప్రభుత్వం విడుదల చేసిన బకాయిలు పోగా ఇంకా ప్రభుత్వం రూ.38 కోట్లు ఇవ్వాల్సి ఉంది. డెయిరీలో పనిచేసే 72 మంది రెగ్యులర్, 48 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.13 కోట్లు ఇచ్చి వీఆర్‌ఎస్ ద్వారా సెటిల్ చేశాతం. ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే పీ–4 పద్ధతిలో కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
– రాజమోహన్, సీఈఓ, పీఎంపీసీఎల్(ఒంగోలు డెయిరీ)
పాలకవర్గం ఇష్టానుసారంగా తిన్నారు
నేను 2000 సంవత్సరం నుంచి పాలకేంద్రం మూసే వరకు నాలుగు విడతలుగా ఓబచెత్తపాలెం పాలకేంద్రానికి ప్రెసిడెంట్‌గా ఉన్నాను. పాలకేంద్రానికి చెందిన డబ్బులను పాలకవర్గం చైర్మన్, డైరెక్టర్‌లు ఇష్టానుసారంగా ఖర్చుచేశారు. జనరల్ బాడీ మీటింగ్ జరిగితే పొట్టేళ్లను కొసి పాలకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలను కూడా పిలిపించుకొని చేసిన ఖర్చంతా ఒంగోలు డెయిరీ బిల్లులలోనే చూపించేవారు. అలా డెయిరీకి చెందిన లాభాలన్నీ పోగా చివరకు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమైంది. దాని మీద ఆధారపడి వేలాది మంది పాడి రైతులు ఆధారపడ్డారు. చివరకు పాలకేంద్రాన్ని తెరిపించే దిక్కు లేదు. – గంగిరెడ్డి ఓబుల్‌రెడ్డి, మాజీ పాలకేంద్రం సొసైటీ ప్రెసిడెంట్, చీమకుర్తి
పచ్చ నేతలవే


