మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం తాత్కాలికంగా జనవరి మొదటి వారంలో ఏర్పాటు చేశారు. ఒంగోలు ఆర్‌ఎంను మార్కాపురం జిల్లా ఇన్‌చార్జి ఆర్‌ఎంగా నియమించారు. అయితే 6 నెలలు కావస్తున్నా ప్రభుత్వం రెగ్యులర్ ఆర్‌ఎంను నియమించకపోవడం, ఆర్‌ఎం కార్యాలయానికి సంబంధించిన పర్సనల్, అకౌంట్ డిపార్టుమెంట్లు సిబ్బందిని నియమించకపోవడంతో ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు గ్రీవెన్స్ కోసం గతంలో లాగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా పరిధిలో మార్కాపురం, గిద్దలూరు, పొదిలి, కనిగిరి డిపోల్లో సుమారు 1500 మంది సిబ్బంది పనిచేస్తుండగా 303 బస్సులు ఉన్నాయి. ప్రతి రోజూ 1,21,945 కిలోమీటర్ల మేర తిరుగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. 6 నెలలు కావస్తున్నా డిపోలో శాశ్వత ఆర్‌ఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. సిబ్బందిని కూడా నియమించలేదు. దీనితో ఏదైనా అవసరం వస్తే ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది.
ఇప్పటికీ ఒంగోలు కేంద్రంగా కార్యకలాపాలు:
మార్కాపురం జిల్లా ఏర్పాటైనప్పటికీ రెగ్యులర్ ఆర్‌ఎం కార్యాలయం, ఆర్‌ఎంను నియమించకపోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు ఒంగోలు వెళ్లాల్సి వస్తోంది. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లోని ప్రజలు ఫిర్యాదులు, ప్రత్యేక బస్సుల డిమాండ్, కొత్త సర్వీసుల ప్రతిపాదనలు ఇవ్వాలంటే ఒంగోలు వెళ్లాల్సిందే. దీంతో జిల్లా ప్రజలకు ఆర్టీసీ సేవలు సకాలంలో అందడం లేదు. బస్సుల కొరత, కొత్త రూట్లు, డిపో అభివృద్ధి, బస్టాండు సౌకర్యాలపై నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రయాణికులు నేరుగా ఆర్‌ఎంను కలిసే అవకాశం తగ్గుతోంది. సిబ్బంది అప్పీల్ కోసం ఒంగోలుకు వెళ్తున్నారు. ఆర్‌ఎం కార్యాలయ ఏర్పాటుకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించలేదు. రెగ్యులర్ ఆర్‌ఎంను నియమిస్తే దాదాపు 15 మంది సిబ్బంది వస్తారు. ప్రయాణికులకు, సిబ్బందికి మెరుగైన సేవలు వస్తాయి. ప్రస్తుతం చిన్నపనికి కూడా ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది. మార్కాపురం డిపోలో 406 మంది ఉద్యోగులు, గిద్దలూరులో 356, కనిగిరిలో 388, పొదిలి 333 మంది సిబ్బందితో పాటు అదనంగా మరికొంత మంది సిబ్బంది ఉన్నారు. వీరందరూ ఏవైనా సమస్యలు వస్తే ప్రస్తుతం ఒంగోలు వెళ్తున్నారు.
మార్కాపురం జిల్లా ఏర్పాటైనా ఒంగోలు కేంద్రంగానే కార్యకలాపాలు
గ్రీవెన్స్ కోసం ఒంగోలుకు వెళ్లక తప్పని ఇక్కట్లు
మార్కాపురం జిల్లాలో మండలాలు: 21 మార్కాపురం జిల్లాలో డిపోలు : 4 జిల్లా పరిధిలో ఉన్న బస్సులు: 303 4 డిపోల పరిధిలో ఉన్న సిబ్బంది: 1500 రోజూ బస్సులు తిరిగే కిలోమీటర్లు: 1,21,945


