రియల్టర్‌ హత్య కేసులో ఇద్దరు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రియల్టర్‌ హత్య కేసులో ఇద్దరు అరెస్టు

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

రియల్టర్‌ హత్య కేసులో ఇద్దరు అరెస్టు

వివరాలు వెల్లడించిన సీఐ అజయ్‌కుమార్‌

పుల్లలచెరువు: రియల్టర్‌ను దారుణంగా హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ నెల 10వ తేదీన పుల్లలచెరువు మండలంలోని శతకోడు గ్రామంలో జరిగిన రియల్టర్‌ రవికుమార్‌ హత్య కేసు వివరాలను ఆదివారం సీఐ అజయ్‌కుమార్‌ విలేకర్లకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. శతకోడుకు చెందిన జువ్వా అనీల్‌కుమార్‌కు ఉన్న 67 ఎకరాల అసైన్‌మెంట్‌ భూమిని అదే గ్రామానికి చెందిన వరకూటి చిన్న పోలిరెడ్డి, మృతుడు రవికుమార్‌లు కలిసి హైదరాబాద్‌కు చెందిన సైదారావు గ్రూపునకు విక్రయించారు. ఈ క్రమంలో వారి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. కొన్ని రోజుల తర్వాత చిన్నపోలిరెడ్డి, రవికుమార్‌ల మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. కాగా, ఆ భూమికి దారి సమస్య ఏర్పడటానికి రవికుమారే కారణమని చిన్నపోలిరెడ్డి భావించాడు. రవికుమార్‌ను అంతమొందించాలనే ప్లాన్‌తో, పొలం కొలతల నెపంతో పోలిరెడ్డి తన కుమారుడి చేత రవికుమార్‌కు ఫోన్‌ చేయించి పిలిపించాడు. పొలం వద్దకు వెళ్ళాక దారి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రవికుమార్‌ సమాధానంతో ఆగ్రహానికి గురైన చిన్నపోలిరెడ్డి.. రవికుమార్‌ పొలం కంచె దాటుతున్న సమయంలో యాకసిరి యల్లయ్య వద్ద ఉన్న గొడ్డలి తీసుకుని వెనుక నుంచి దాడి చేశాడు. రవికుమార్‌ మెడపై బలంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గొడ్డలిని, రక్తంతో తడిసిన దుస్తులను సంఘటన స్థలం సమీపంలో విసిరేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్‌ఐ సాంబశివరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ముటుకుల గ్రామ సమీపంలో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ అజయ్‌కుమార్‌, ఎస్‌ఐ సాంబశివరావు మరియు సిబ్బందిని ఎస్పీ హర్షవర్థన్‌రాజు, డీఎస్పీ నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement