దద్దరిల్లిన ఉమ్మడి జిల్లా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో హోరెత్తిన నిరసనలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కదంతొక్కి.. హాజరైన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చంద్రబాబు మోసాలను ఎండగట్టిన వైఎస్సార్ సీపీ నాయకులు
యర్రగొండపాలెంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
కొండపిలో నిరసన ర్యాలీగా వస్తున్న ప్రజలు,
బ్యానర్‌తో ఆదిమూలపు సురేష్ ఆందోళన
దర్శిలో భారీ ర్యాలీ, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, మోసపూరిత పాలన సాగించిందంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాగ్రహం ఎగిసింది. వైఎస్సార్ సీపీ శ్రేణులతోపాటు వేలాదిగా ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చిన నిరసనలతో హోరెత్తించారు. నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ప్రదర్శనలతో కూటమి సర్కారు వైఫల్యాలను ప్లకార్డులతో ఎండగట్టారు. సూపర్ సిక్స్ హామీలు, బాబు షూరిటీ– భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక భరోసా, రైతులకు మద్దతు, విద్యార్థులకు సహాయమంటూ ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. పలు చోట్ల బూటకపు హామీలకు ప్రతీకగా బాబు షూరిటీ పత్రాలు, ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, వృద్ధులు భారీ సంఖ్యలో నిరసనల్లో పాల్గొనడం కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా నిలిచింది. వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం దర్శిలో విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ పరిశీలకుడు డాక్టర్ మాదాసి వెంకయ్య హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా హాజరై కూటమి ప్రభుత్వ చర్యలను ఖండించారు.
డీఎస్సీ పేరుతో దగా
ఎన్నికల హామీలను విస్మరించి చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసనగా శుక్రవారం పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్’ను ‘సూపర్ ఫ్లాప్’ చేసి, మహిళలను, నిరుద్యోగులను ప్రభుత్వం వంచించిందన్నారు. మెగా డీఎస్సీ2025 నియామకాలన్నీ దగా అని, అభ్యర్థులకు కాల్ లెటర్లు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటుతుందని స్పష్టం చేశారు.
ఎడ్ల బండిపై ర్యాలీ..
కొండపి నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ ర్యాలీని ప్రారంభించి ముందడుగు వేశారు. కూటమి పరిపాలనా తీరును ఎండగట్టారు. ఎటు చూసినా ఉత్సాహం ఉరకలేసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పెద్దకండ్లగుంట సర్పంచ్ భువనగిరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండి ర్యాలీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సురేష్ ప్రసంగిస్తున్న సమయంలో స్వల్ప అనారోగ్యానికి గురైనా.. కొంత విశ్రాంతి తీసుకొన్న వెంటనే శ్రేణులను ఉత్తేజపరచడానికి కూర్చొని తన ప్రసంగాన్ని కొనసాగించారు.
సంతనూతలపాడులో కదంతొక్కి..
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం సంతనూతలపాడులో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జనం కదంతొక్కారు. ఉదయం 11:30 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమైంది. ఒంగోలు–కర్నూలు రోడ్డులోని సంతనూతలపాడు పోలీస్‌స్టేషన్, బస్టాండ్ కూడలి, పెద్దబజారులోని బ్రహ్మంగారి దేవస్థానం మీదుగా పార్టీ నియోజకవర్గ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించి..
ఒంగోలులో అంబేడ్కర్ భవన్ నుంచి చర్చి సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వరకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, తదితరులు పాల్గొని వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా తరలివచ్చి చర్చి సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
వసూల్ రాజాల పాలనకు రెండేళ్లు..
కందుకూరు నియోజకవర్గంలో వసూల్ రాజా పాలనకు రెండేళ్లు గడిచిపోయాయంటూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో శుక్రవారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు అధికార తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర బెడిసికొట్టి జనాల్లో నవ్వులపాలైంది. విజయోత్సవ ర్యాలీ పేరుతో ఆ పార్టీ నాయకులు చేపట్టిన ర్యాలీ జనాలు లేక వెలవెలపోగా.. వైఎస్సార్ సీపీ ర్యాలీ సూపర్‌సక్సెస్ అయింది.
బాబు పాలనలో విధ్వంసమే..
అధికారం కోసం సూపర్–6తోపాటు నోటికొచ్చిన హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కగానే నిజస్వరూపం బయటపెట్టారని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మార్కాపురం పట్టణం తూర్పువీధిలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా గడియార స్తంభం సెంటరులోని వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు.
జనసంద్రంగా గిద్దలూరు..
గిద్దలూరులో జనసంద్రం పోటెత్తింది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు.. పేరుతో నిరసన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేపట్టారు. వేణుగోపాలస్వామి ఆలయం మీదుగా గణేష్ నగర్, పొట్టిశ్రీరాముల సెంటర్, మెయిన్‌బజార్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి పోయాం మోసం.. పోయాం మోసం అంటు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు.
కనిగిరిలో కూటమి మేనిఫెస్టో ప్రతుల దహనం
కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి దద్దాల నారాయణయాదవ్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. ఒంగోలు బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి పట్ట ప్రధాన వీధుల గుండా ర్యాలీ స్థానిక పామూరు బస్టాండ్ చర్చి సెంటర్ వరకు సాగింది. స్థానిక సుగుణావతమ్మ ఆస్పత్రి సెంటర్‌లో మేనిఫెస్టో ప్రతులను పార్టీ శ్రేణులు దహనం చేశారు. ర్యాలీలో పార్టీ శ్రేణులు, రైతు, విద్యార్థి, మహిళా, యువత వివి ధ విభాగాల శ్రేణులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు.
అద్దంకిలో భారీ ర్యాలీ..
అద్దంకిలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ నేతృత్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు హాజరై కూటమి ప్రభుత్వ చర్యలను ఖండించారు.
కందుకూరులో భారీ జనసందోహం, అంబేడ్కర్‌కి నివాళులర్పిస్తున్న బుర్రా
సంతనూతలపాడులో నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున
అద్దంకిలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న చింతలపూడి అశోక్‌కుమార్, పార్టీ నేతలు
ఒంగోలు.. భారీ ర్యాలీలో బత్తుల, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు


