చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలి | - | Sakshi
Sakshi News home page

చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలి

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలి కుక్కల దాడిలో జింక మృతి ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలి

డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటేశ్వర్లు

ఒంగోలు టౌన్‌: చిన్నారులు ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ టి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ నెల 28 నుంచి జరిగే జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వైద్యాధికారులు, సూపర్‌వైజర్లకు ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ మొదటి రోజు నిర్దేశించిన కేంద్రంలో జీరో నుంచి 5 సంవత్సరాల వయసున్న చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. మిగిలిన చిన్నారులకు రెండో రోజు, మూడో రోజు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర వలస కార్మికుల పిల్లలు ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. జాతీయ పోలియో దినం రోజున నిర్దేశించిన కేంద్రాలకు తల్లిదండ్రులు స్వయంగా వారి పిల్లలను తీసుకొచ్చేలా చూడాలన్నారు. జనసాంధ్రత ఎక్కువగా ఉండే ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వే స్టేషన్లు, కూరగాయల మార్కెట్లలోని చిన్నారులకు ట్రాన్సిట్‌ బూత్‌ల ద్వారా పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. 100 శాతం పోలియో చుక్కలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. ఈ శిక్షణలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డా.కమల శ్రీ, మాస్‌మీడియా అధికారి బెల్లం శ్రీనివాసులు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

కొండపి: కుక్కల దాడిలో జింక మృతి చెందిన సంఘటన మండలంలోని కొండపి పంచాయతీ ముక్కోటిపాలెం గ్రామ శివారుల్లోని వైష్ణవి డైరీ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ముక్కోటిపాలెం చిన్నకండ్లగుంట సమీపంలోని పొలాల్లో జింకలు రాత్రి వేళలో తిరుగుతూ ఉంటాయి. శుక్రవారం తెల్లవారుజామున నీటి కోసం జింక ముక్కోడిపాలెం గ్రామంలోకి వచ్చింది. జింకను గమనించిన కుక్కలు వెంబడించడంతో జింక తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసి విఫలమైంది. కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో కుక్కల దాడిలో కొంతమేర గాయపడి వైష్ణవి డైరీ వద్ద ఉన్న నీటి కుంటలో పడడంతో తల, ఇతర భాగాలు దెబ్బతిన్నాయి. ఉదయం గమనించిన స్థానికులు జింకను బయటకు తీయడంతో అప్పటికే మరణించింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు, పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ముక్కోడిపాలెం సమీపంలోని ప్రభుత్వ స్థలంలో పంచనామా నిర్వహించి జింకను ఖననం చేశారు. కార్యక్రమంలో ఒంగోలు అటవీశాఖ అధికారులు భూషణ్‌, రామకృష్ణ, రంగనాయకులు, వెటర్నరీ డాక్టర్‌ చంద్రశేఖర్‌ సిబ్బంది శ్రీను, సిద్దు, హర్ష, పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్‌రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించిన కలెక్టర్‌

ఒంగోలు సబర్బన్‌: పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ పి.రాజాబాబు కోరారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకూ బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యుమరేట్‌ చేయనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో శుక్రవారం ప్రకాశం భవనంలో కలెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరూ ఓటర్ల జాబితాలో ఉండాలన్నదే ఎలక్షన్‌ కమిషన్‌ చేపట్టిన శ్రీసర్‌శ్రీ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా లోపరహితంగా రూపొందించేందుకు 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోలు ఈ ప్రక్రియ నిర్వహించే సమయంలో రాజకీయ పార్టీల తరఫున బీఎల్‌ఏలకు కూడా అందుబాటులో ఉండి సహకరించేలా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. నెల రోజులపాటు జరిగే మ్యాపింగ్‌ ప్రక్రియకు సంబంధించిన పురోగతిని, క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకునేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతివారం ఇలాంటి సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో డీఆర్‌ఓ మాధురి, ఆర్డీవోలు విజయ జ్యోతి కుమారి (అద్దంకి), చంద్రశేఖర్‌ నాయుడు (ఒంగోలు), ఒంగోలు, కందుకూరు మున్సిపల్‌ కమిషనర్లు, అద్దంకి, చీమకుర్తి, దర్శి, కందుకూరు తహసీల్దార్లు, ఇతర అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement