అధికార పార్టీ అభాసుపాలు.! | - | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ అభాసుపాలు.!

Jun 13 2026 1:35 PM | Updated on Jun 13 2026 1:35 PM

కందుకూరు: తాను తీసుకున్న గొయ్యిలో తానేపడినట్లు.. వైఎస్సార్‌ సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు కందుకూరులో అధికార టీడీపీ చేసిన కుట్ర బెడిసికొట్టి చివరకు జనాల్లో నవ్వులపాలైంది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి పోటీగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ పూర్తిగా తేలిపోయింది. టీడీపీ నాయకులు చేపట్టిన ర్యాలీ జనాలు లేక వెలవెలబోయింది. అదే సమయంలో వైఎస్సార్‌ సీపీ ర్యాలీ సూపర్‌ సక్సెస్‌ కావడం అటు సాధారణ ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు అనవసర ప్రయత్నం చేసి పరువు పోగొట్టుకున్నారంటూ టీడీపీపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విజయోత్సవం అంటూ..

వెలవెలబోయి...

రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన దానికి నిరసనగా వైఎస్సా ర్‌సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు 10 రోజుల క్రితమే ప్లాన్‌ చేసుకున్నారు. శుక్రవారం పట్టణంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్‌ సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు అధికార టీడీపీ నాయకులు రాత్రి రాత్రే కుట్రకు తెరలేపారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ చేస్తామంటూ సోషల్‌ మీడియాలో గురువారం రాత్రి ప్రకటించారు. అది కూడా వైఎస్సార్‌ సీపీ ర్యాలీ జరిగే సమయానికే చేస్తామంటూ ప్రచారం చేశారు. పోలీసులను రంగంలోకి దించడంతో ముందుగా టీడీపీ ర్యాలీకి అనుమతిచ్చారు. స్థానిక ఎన్‌టీఆర్‌ సర్కిల్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు టీడీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడే టీడీపీ నాయకులకు షాక్‌ తగిలింది. విజయోత్సవ ర్యాలీకి భారీగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వస్తారని భావించగా.. కనీసం వందల మంది కూడా లేకపోవడంతో ర్యాలీ పూర్తిగా వెలవెలబోయింది.

వైఎస్సార్‌ సీపీ ర్యాలీలో

కదంతొక్కిన వేల మంది...

ముందుగానే ప్రకటించినప్పటికీ వైఎస్సార్‌ సీపీ ర్యాలీకి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గురువారం రాత్రి నుంచే రంగంలోకి దిగి శుక్రవారం ఉదయం చేయాల్సిన ర్యాలీని సాయంత్రానికి మార్చుకోవాలంటూ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనికి ససేమిరా అన్న బుర్రా.. తాము పది రోజుల క్రితమే ర్యాలీ ఉంటుందని అనుమతి కోరామని, ప్రకటించిన సమయానికి తమ ర్యాలీ ఉంటుందంటూ తెగేసి చెప్పారు. అయితే టీడీపీ ర్యాలీ పూర్తయిన తరువాత అనుమతిస్తామంటూ పోలీసులు చెప్పారు. ఉదయం 11 గంటలకు కనిగిరి రోడ్డులోని మెర్సి స్కూల్‌ ఆవరణ నుంచి ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండగా, టీడీపీ ర్యాలీ పూర్తి కాలేదు.. మీరు అప్పుడే రావద్దంటూ పోలీసులు అడ్డుచెప్పారు. కనీసం ప్రచార వాహనాన్నిగానీ, మైక్‌ పర్మిషన్‌గానీ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. అప్పటికే భారీగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు మెర్సి స్కూల్‌ ఆవరణకు చేరుకుని ర్యాలీకి సిద్ధమయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువవుతున్నా టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సభ పెట్టి మాట్లాడుతూ ఆలస్యం చేశారు. ఆ విషయం గ్రహించిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పోలీసుల అడ్డుగోడలను తొలగించుకుని ముందుకు కదిలారు. వేలాది మంది ఒకేసారి రావడంతో పోలీసులు చేసేదేమీ లేక ర్యాలీకి అక్కడక్కడా బ్రేక్‌లు వేస్తూ.. టీడీపీ నాయకులను వీలైనంత త్వరగా అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నుంచి పంపించే ప్రయత్నాలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా ముందుకు కదిలారు. వేల మంది కార్యకర్తలతో అంబేడ్కర్‌ విగ్రహం వరకు కనిగిరి రోడ్డు కిక్కిరిసిపోయింది.

వైఎస్సార్‌ సీపీ నిరసన ర్యాలీకి పోటీగా

కందుకూరులో టీడీపీ విజయోత్సవ ర్యాలీ

రెండు పార్టీల ర్యాలీలు ఒకే సమయంలో కావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ

ముందుగా టీడీపీ ర్యాలీకి పోలీసుల అనుమతి

వైఎస్సార్‌ సీపీ ర్యాలీకి అడుగడుగునా

అడ్డంకులు

ప్రజల నుంచి స్పందన లేక పూర్తిగా

తేలిపోయిన టీడీపీ ర్యాలీ

ఎన్‌టీఆర్‌ విగ్రహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు తూతూమంత్రంగా ర్యాలీ

అదే సమయంలో వేల మందితో అంబేడ్కర్‌ విగ్రహం వరకు వైఎస్సార్‌ సీపీ ర్యాలీ

రెండు పార్టీల ర్యాలీలను పోల్చుకుని టీడీపీ ర్యాలీ అట్టర్‌ఫ్లాప్‌ అంటూ జనాల్లో చర్చ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement