వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రకాశం జిల్లాలోని బీఎల్‌ఏలకు అవగాహన సమావేశం పాల్గొన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జోనల్ ఇన్‌చార్జ్ పుత్తా శివశింకరరెడ్డి
ఒంగోలు సిటీ: ఓటర్ల జాబితా సవరణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్ సీపీ బీఎల్‌ఏ లకు ఓటర్ల ప్రత్యేక జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పై నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, అబ్జర్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, మండల బూత్ అధ్యక్షులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నుంచి ఎస్‌ఐఆర్ ప్రారంభమవుతుందని, ఈలోపే అన్ని నియోజకవర్గాల్లో బూత్ ఏజెంట్లను నియమించుకొని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు. ప్రతి ఓటరును బీఎల్‌ఓలతో కలిసి వెరిఫై చేసి డూప్లికేట్ ఓట్లను, డెత్ ఓటర్లను తొలగించాలని, ఈ విషయంలో అధికార పార్టీ ఓట్లను జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని, ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి సంతకం చేసి బీఎల్‌ఓ లకు ఇవ్వాలని సూచించారు. డూప్లికేట్ ఓట్ల తొలగింపులు చేపడతారని, ఇందులో నిజమైన ఓటర్ల తొలగింపు జరిగితే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. మార్పులు, చేర్పులు, మరణించినవారి పేర్లను పరిశీలించి తొలగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రతి బీఎల్‌ఏ 2025 ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి అవగాహన తెచ్చుకోవాలని సూచించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జోనల్ ఇన్‌చార్జ్ పుత్తా శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఎస్‌ఐఆర్ పై దృష్టి పెట్టి పనిచేస్తుందని, ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జాగ్రత్తలు తీసుకొని ఓటర్ల సవరణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఓటుని పరిశీలించాలన్నారు. అనేక రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ వల్ల ముఖ్యమంత్రులే ఓడిపోయారని, ప్రతి ఓటరు మనకు ముఖ్యమని, దానికి అనుకూలంగా పని చేయాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ నిర్వహించాలన్నారు. ఎస్‌ఐఆర్ జరిగిన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లో 34 లక్షలు, గుజరాత్‌లో 68 లక్షలు, తమిళనాడులో 74 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో 91 లక్షల ఓట్లను తొలగించారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్ర శేఖర్, మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున, మాజీ మంత్రి కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కసుకుర్తి ఆదెన్న, కేవీ.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షులు కఠారి శంకరరావు, మండల పార్టీ అధ్యక్షులు లంకపోతు అంజిరెడ్డి, దుంపా చెంచిరెడ్డి, మన్నే శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజీవ్, మండల నాయకులు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.


