ఉద్యమం ఉధృతం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమం ఉధృతం

May 17 2026 7:32 AM | Updated on May 17 2026 7:32 AM

పొగాకు కొనుగోళ్లలో మాంద్యం సృష్టిస్తున్నారు పొగాకు వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు ఆహ్వానించాలి కిలో పొగాకుకు రూ.200 కూడా రావటం లేదు మాజీ మంత్రి మేరుగు నాగార్జున, చుండూరి రవిబాబు ఒంగోలు–2 పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన వైఎస్సార్‌ సీపీ నాయకులు

రైతులను ఆదుకునేందుకు

ఒంగోలు సబర్బన్‌: పొగాకు కొనుగోళ్లలో మాంద్యం సృష్టిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. ఐటీసీ గుత్తాధిపత్యంతో రైతులు నిలువునా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒంగోలు–2 వేలం కేంద్రాన్ని మాజీ మంత్రి, సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ మేరుగు నాగార్జున, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరి రవిబాబు పార్టీ నాయకులతో కలిసి శనివారం సందర్శించారు. పొగాకు వేలం కేంద్రం–2లో పొగాకు వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. వేలం కేంద్రంలోని పొగాకు బోర్డు అధికారులతో, పొగాకు రైతులతో వేలం తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ పొగాకు వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తే కానీ గుత్తాధిపత్యాన్ని వహిస్తున్న ఐటీసీకి బుద్ధిరాదన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా పొగాకు రూ.38 వేలు వరకూ కొనుగోలు చేశామని, ప్రస్తుతం పంట పండించాలంటే ఖర్చులు పెరిగి రూ.30 వేల వరకూ అవుతున్నాయని చెప్పారు. ఈ నష్టాన్ని రైతులు ఏవిధంగా భరిస్తారని నిలదీశారు. ఇదేవిధంగా ఉంటే రైతులు పొగాకు క్రాప్‌ హాలిడే ప్రకటిస్తే పొగాకు వ్యాపారులు ఏమవుతారని ప్రశ్నించారు. పొగాకు బోర్డు ఈడీని కలుస్తాం, వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ద్వారా కేంద్ర మంత్రులను కలిసి పరిస్థితిని వివరిస్తామన్నారు.

లంచాలు మరిగి రైతులను గాలికి వదిలేశారు

వైఎస్సార్‌ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చుండూరు రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడొచ్చినా వ్యాపారుల పక్షాన ఉంటూ పర్సంటేజీలు దండుకోవటమే పనిగా పెట్టుకుంటున్నారన్నారు. ఈ ఏడాది కిలో పొగాకుపై రూ.80 దండుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం లంచాలు మరిగి రైతులను గాలికి వదిలేస్తుందని ధ్వజమెత్తారు. ఒక్క సిగరెట్టుకు రూ.0.70 పైసలు మాత్రమే ఖర్చవుతుందని, కానీ రూ.10 నుంచి రూ.20 వరకూ అమ్ముకొని కంపెనీలు అత్యధికంగా లాభాలు గడిస్తున్నాయన్నారు. రైతుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.

వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు వేద్దామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేవన్నారు. కనీసం కిలోకు రూ.200 కూడా రావటం లేదన్నారు. వేలం కేంద్ర పొగాకు రైతు నాయకుడు సునీల్‌ బాబు మాట్లాడుతూ టీడీపీకి చెందిన ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శ్రీకృష్ణదేవరాయలుతో పాటు మరికొంత ఎంపీలను కలిసి సమస్యను వివరించినా ప్రయోజనం లేదన్నారు. కార్యక్రమంలో మద్దిపాడు మాజీ ఏఎంసీ చైర్మన్‌ ఇనగంటి పిచ్చిరెడ్డి, వైఎస్‌ఆర్‌ సీపీ ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు మన్నె శ్రీనివాసరావు, నాగులుప్పులపాడు మండల పార్టీ అధ్యక్షుడు పోలవరపు శ్రీమన్నారాయణ, మద్దిపాడు ఎంపీపీ కోటిరెడ్డి, సంతనూతలపాడు మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచి రెడ్డి, వేలం కేంద్రం పొగాకు రైతు నాయకుడు వడ్డెళ్ల ప్రసాదు, సునీల్‌ బాబు, వైఎస్‌ఆర్‌ సీపీ నాయకులు బొట్ల రామారావు, పాలడుగు రాజేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement