కందుకూరు: ప్రజా రవాణా వ్యవస్థలో ప్రధానరంగమైన ఆర్టీసీ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందని, ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం స్థానిక డిపో వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సులు కొనే ప్రతిపాదనను ప్రభుత్వం చేస్తోందని, దీని ద్వారా ఆర్టీసీ డిపోలను ఖాళీ చేయించే కుట్రకు ప్రభుత్వం తెరలేపుతోందన్నారు. విద్యుత్ బస్సులను పూర్తిగా ఆర్టీసీ సంస్థకే అప్పగించాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 60 శాతం పోస్టులను భర్తీ చేయాలన్నారు. సీ్త్ర శక్తి పథకం విజయవంతం కావాలంటే 3 వేల కొత్త బస్సులను కొని ఆర్టీసీకి ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న డీఆర్సీ అరియర్స్‌ను క్లియర్ చేయడంతో పాటు, 12వ పీఆర్‌సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ మాత్రమే నడిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిపో అధ్యక్షుడు మహేష్‌బాబు, గ్యారేజీ అద్యక్ష, కార్యదర్శులు స్వామి, రహంతుల్లా, సిసిఎస్ డిలిగేట్ నల్లూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే సహించం
పొదిలి: ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రభుత్వ యత్నాలను అడ్డుకుంటామని స్థానిక ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చెప్పారు. స్థానిక ఆర్టీసీ గ్యారేజీ గేటు వద్ద మహ్మద్ అబ్దుల్ బాజీ అధ్యక్షతన శనివారం గేట్ మీటింగ్ నిర్వహించారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటుకు అప్పగించడం ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ఎత్తుగడలో భాగమేనని విమర్శించారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరిట డిపోలను ఖాళీ చేసి, ఉద్యోగులను ఇతర డిపోలకు తరలించే విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. 11వ పీఆర్‌సీ బకాయిలు, డీఏ అరియర్స్, కొత్త డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. 12వ పీఆర్‌సీ కమిషన్ నియమించి ఐఆర్ వెంటనే చెల్లించాలన్నారు. ధర్నాలో డిపో గౌరవాధ్యక్షుడు ఎం.షరీఫ్, స్టేట్ కమిటీ సభ్యులు పి.కొండలరావు, పీఎన్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి, డిపో సెక్రటరీ పి.ఓబులేసు, ఎంఎన్.మీరా, బ్రహ్మయ్య, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.


