మంత్రి స్వామికి సమస్యల ఏకరువు | - | Sakshi
Sakshi News home page

మంత్రి స్వామికి సమస్యల ఏకరువు

May 17 2026 7:32 AM | Updated on May 17 2026 7:32 AM

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ గ్రామ పంచాయతీలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పాల్గొనగా, స్థానిక ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. స్థానిక ఎస్సీకాలనీకి చెందిన ఉపాధి హామీ పథకం మహిళా కూలీలు తమ కాలనీలో తాగునీటి సమస్య ఉందని, ఇటీవల బోర్లు వేసినప్పటికీ వేసవి కావడంతో చాలడం లేదని మంత్రికి తెలిపారు. రామతీర్థం నీరు గ్రామానికి వస్తున్నాయే తప్ప ఎస్సీకాలనీకి రావడం లేదన్నారు. రామతీర్థం నీరు ఎస్సీకాలనీ వరకు వచ్చేలా పైపులైను వేయాలని కోరారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని, మురుగునీరు సక్రమంగా పారడం లేదని, మురుగు కాల్వలు నిర్మించాలని మంత్రిని కోరారు. తాతయ్య ఎస్టీకాలనీ వద్ద గల మేళం వాగు చెరువుకు ఉన్న రెండు తూముల నుంచి నీరు లీకవుతోందని, కొత్త తూములు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి స్వామి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

తూతూమంత్రంగా

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర...

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాతసింగరాయకొండలో తూతూమంత్రంగా జరిగిందన్న విమర్శలు వినిపించాయి. గ్రామంలో మూడు నెలలకుపైగా పారిశుధ్య కార్మికులు లేరని, ఈ కార్యక్రమం కోసం ముందు రోజు ఇద్దరిని పనిలోకి తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేగాకుండా జంట గ్రామాలైన మూలగుంటపాడు నుంచి ఇద్దరిని, సింగరాయకొండ నుంచి ఆరుగురిని తీసుకొచ్చి కార్యక్రమాన్ని మమ అనిపించారని, మంత్రి స్వామి కూడా రోడ్లు శుభ్రం చేసే కార్యక్రమం కాకుండా రోడ్లు తిరిగే కార్యక్రమం చేశారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. గ్రామంలో పారిశుధ్య కార్మికులు లేకపోవటంతో గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టరు గ్రామ సచివాలయం వద్దే సంవత్సర కాలంగా నిరుపయోగంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

టీడీపీలో బయటపడిన వర్గ విభేదాలు...

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయన్న ప్రచారం మండలంలో జోరుగా సాగుతోంది. పాత సింగరాయకొండ గ్రామ పంచాయతీ ఆ మండల టీడీపీ అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య స్వగ్రామం. గ్రామ పంచాయతీలో గ్రావెల్‌ మాఫియా ప్రధాన సూత్రధారులైన మించల బ్రహ్మయ్య, గాలి హరిబాబు రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నారు. కొంత కాలంగా ఈ రెండు వర్గాలు ఉప్పు–నిప్పుగా ఉన్నాయి. మంత్రి స్వామి రాక సందర్భంగా గాలి వర్గం వేసిన ఫ్లెక్సీలలో మించల బ్రహ్మయ్య ఫొటో వేయకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల గాలి హరిబాబు తన వర్గాన్ని, గ్రావెల్‌ సామ్రాజ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు తన బంధువులను పార్టీలో చేర్చుకోవటానికి ఆసక్తి చూపగా, ఆ ప్రయత్నానికి మించల బ్రహ్మయ్య అడ్డుపడ్డాడన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. గాలి వర్గం బలపడితే తనకు తలనొప్పి అవుతుందని బ్రహ్మయ్య భావిస్తున్నాడని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. శనివారం కార్యక్రమం గాలి వర్గం నిర్వహించగా, బ్రహ్మయ్య వర్గం దూరంగా ఉంది. చాలా మంది నాయకులు కూడా హాజరు కాలేదని, దీనిపై మంత్రి స్వామి కూడా అసహనం వ్యక్తం చేశారని పార్టీలో చర్చ నడుస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా ఉపాధి హామీ పథకం కూలీలకు ముందుగానే మస్టర్లు వేసి వారందరినీ ట్రాక్టర్ల ద్వారా కార్యక్రమానికి తరలించారని చర్చించుకుంటున్నారు. దీనికితోడు కొంతకాలంగా మంత్రి స్వామి, దామచర్ల సత్య ఇద్దరూ కార్యక్రమాలలో పాల్గొంటున్నారని, కానీ, శనివారం మంత్రి స్వామి మాత్రమే పాల్గొన్నారని, వారిద్దరి మధ్య కూడా విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకే సత్య వర్గం కూడా స్వామి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం ఉంది. స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో టీడీపీలోని వర్గ విభేదాలు బయటపడ్డాయని మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

పాత సింగరాయకొండలో స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న మంత్రి స్వామి

ఉపాధి కూలీలతో కార్యక్రమం నిర్వహణ

పక్క పంచాయతీల నుంచి పారిశుధ్య కార్మికుల తరలింపు

బయటపడిన టీడీపీలోని వర్గ విభేదాలు

మండలస్థాయి నాయకులపై మంత్రి స్వామి అసహనం

Advertisement
 
Advertisement
Advertisement