అర్ధవీడు: ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని రంగాపురం ఎస్సీ కాలనీలో శనివారం జరిగింది. అందిన వివరాల ప్రకారం..అర్ధవీడు మండలం రంగాపురం ఎస్సీ కాలనీకి చెందిన గడెం అభిలాష్ (17) అనే బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అభిలాష్ తల్లిదండ్రులు మరణించడంతో రంగాపురంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కంభం పట్టణంలో ఐటీఐ చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అనూమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్సై శివ నాంచారయ్య సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● రూ.1.50 లక్షల నష్టం
కొత్తపట్నం: మండలంలోని గుండమాల గ్రామం పెద్దపాలేనికి చెందిన పిన్ని లక్ష్మణరావుకు సంబంధించిన వేట సామగ్రి శనివారం అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. వంజరం, కనగుర్త చేపల వేటకు వినియోగించే మూడు టంగీస్ వలలు ఉదయం అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. ఒక వల పూర్తిగా కాలిపోగా, రెండు వలలు పాక్షికంగా కాలిపోయి పూర్తిగా పనికిరాకుండా పోయాయి. మొత్తం మూడు వలలు పనికిరాకుండా పోయాయని, వాటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
● కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పెద్దదోర్నాల: వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనుల వద్ద అస్సోం రాష్ట్రానికి చెందిన కార్మికుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన ఈ నెల 9వ తేదీన జరిగినట్లు భావిస్తుండగా సోదరుని ఫిర్యాదుతో శనివారం వెలుగు చూసింది. ఎస్సై వెంకట రమణయ్య అందించిన వివరాల ప్రకారం.. బసంత్‌కుమార్ రభ (36) పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో కార్మికుడిగా విధులు నిర్వహించేందుకు ఈ నెల 8వ తేదీన మండల పరిధిలోని కొత్తూరు వద్దకు వచ్చాడు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లోని కొల్లంవాగు వద్ద కార్మికుడిగా విధుల్లో చేరినట్లు సమాచారం. ఆ మరుసటి రోజు నుంచి అతను కనిపించకుండా మాయమయ్యాడు. బసంత్‌కుమార్ రభను పనిలో పెట్టుకున్న సదరు ఏజెంట్ ఈ విషయాన్ని అస్సోంలోని అతని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అతని సోదరుడు సుమంత్‌కుమర్ రభ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్, బ్యాగు తదితర వస్తువులు అతనికి కేటాయించిన గదిలోనే వదిలి వెళ్లినట్లు ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు.


