● అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేసిన డీటీసీ సుశీల
ఒంగోలు సబర్బన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్ స్పాట్‌లను డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఆర్.సుశీల శనివారం పరిశీలించారు. పోలీస్ అధికారులు, జాతీయ రహదారుల అధికారులతో కలిసి ఎన్‌హెచ్–16 గుడ్లూరు సర్కిల్ పరిధిలోని మోచర్ల మొదలుకుని అద్దంకి సర్కిల్ పరిధిలోని మేదరమెట్ల వరకూ బ్లాక్ స్పాట్లను పరిశీలించారు. ప్రమాదాలు జరిగేలా ఉన్న ప్రాంతాలు, ఇప్పటి వరకూ ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేశారు. ఈ సందర్భంగా డీటీసీ ఆర్.సుశీల మాట్లాడుతూ కలెక్టర్ పి.రాజాబాబు ఆదేశాల మేరకు 5 బ్లాక్ స్పాట్లపై జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసినట్లు చెప్పారు. జిల్లా మొత్తం మీద 23 బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నారు. 13 బ్లాక్ స్పాట్లను ఫిబ్రవరి నెలలో జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేశామన్నారు. మిగిలిన 10 బ్లాక్ స్పాట్లకుగానూ ఐదు బ్లాక్ స్పాట్లను జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేశామన్నారు. జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేసిన ప్రదేశాలలో ఉలవపాడు మండలం చాగొల్లు ఫ్లై ఓవర్, ఎన్ హెచ్–16లో గుడ్లూరు మండలం మోచెర్ల, తెట్టు, చేవూరు క్రాస్ రోడ్, ఎస్‌హెచ్ – 1678లో కందుకూరు మండలం ఓగూరు వద్ద ఆంజనేయ కోల్డ్ స్టోరేజ్ ప్రాంతాలు ఉన్నాయని వెల్లడించారు. అదేవిధంగా మేదరమెట్ల కొండ ప్రాంతం సమీపంలోని జాతీయ రహదారిని కూడా పరిశీలించి రహదారి ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి వాటిపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఎన్‌హెచ్ 16పై వాహన తనిఖీలు చేపట్టి వాహనంపై టార్పాలిన్ కట్టకుండా, సరైన రికార్డులు లేకుండా ఇసుక తోలుతున్న 4 ట్రాక్టర్లు, ట్రైలర్లను సీజ్ చేశారు. జాయింట్ ఇన్‌స్పెక్షన్‌లో ఎన్‌హెచ్–16 పీడీ అనీల్ కుమార్, ఎన్‌హెచ్–1678 అధికారులు, కందుకూరు డీఎస్పీ, సీఐ, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, సీఐలు, రవాణా శాఖ ఒంగోలు కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ) శ్రీనివాసరావు, దర్శి మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరిశపోగు రవికుమార్, ఇతర పోలీస్ అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.


