విమర్శల విస్తరణ..! | - | Sakshi
Sakshi News home page

విమర్శల విస్తరణ..!

May 7 2026 9:56 AM | Updated on May 7 2026 9:56 AM

విమర్శల విస్తరణ..! నిత్యం రోడ్డు ప్రమాదాలు...

చీమకుర్తి:

ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తొలి నుంచి తీవ్ర విమర్శల పాలవుతోంది. తాజాగా నాలుగు లైన్ల విస్తరణ పొడవును కుదించడంపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో జిల్లా రూపురేఖలు మార్చేస్తామంటూ సీఎంతో పాటు స్థానిక పాలకులు ప్రగల్భాలు పలికారు. అందులో భాగంగా ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు 113 కి.మీ పొడవున ఫోర్‌లైన్‌గా పీపీపీ పద్ధతిలో రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. టీడీపీ స్థానిక నాయకులు సైతం ఊహల్లో తేలారు. అదిగో ఫోర్‌లైన్‌, ఇదిగో టెండర్లు, ఇక టోల్‌గేట్లు పెట్టుకోవడమే తరువాయి అంటూ రెండు సంవత్సరాల నుంచి అధికార పార్టీ నాయకులు, అధికారులు ఊదరగొడుతున్నారు. దాని కోసం ఏడాది నుంచి మూడు సార్లు సర్వేలు చేయించారు. సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి ప్రాంతాలలో అదనంగా బైపాస్‌లు నిర్మించడం, అవసరమైన భూమి సేకరించటం పూర్తయితే ఫోర్‌లైన్‌ నిర్మాణం చేపట్టడమే అని ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా స్థానిక నాయకులు తానా అంటే తందానా అన్నట్లు బాకాలు ఊదారు. తీరా.. తాజాగా తెలిసిన సమాచారంతో అందరూ అవాక్కయ్యారు. ఒంగోలు సమీపంలోని ట్రిపుల్‌ ఐటీ కాలేజీ నుంచి పొదిలి వరకు మాత్రమే ఫోర్‌లైన్‌ను పరిమితం చేస్తూ ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి డీపీఆర్‌ సమర్పించారు. గతంలో ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు 113 కి.మీ పొడవున ఫోర్‌లైన్‌ నిర్మిస్తామని చెప్పిన అధికారులు.. దానిని కేవలం పొదిలి వరకు.. అంటే దాదాపు 42 కి.మీ మాత్రమే నిర్మిస్తే సరిపోతుందని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పొదిలి నుంచి పెద్దగా ట్రాఫిక్‌ సమస్య ఉండదంటూ అక్కడి నుంచి డబుల్‌లైన్‌ నిర్మాణానికి డీపీఆర్‌ పంపారు.

రెండేళ్లుగా ఊరిస్తూ.. చివరకు

ఉసూరుమనిపించడంపై విమర్శలు...

ఫోర్‌లైన్‌ విస్తరణతో ఒంగోలు నుంచి మార్కాపురం జిల్లా వరకు రాకపోకలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ప్రజలు, వాహనదారులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. తీరా ఇప్పుడు లేదనడంతో ఉసూరుమంటూ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు నుంచి సంతనూతలపాడులోని ట్రిపుల్‌ ఐటీ కాలేజీ (8.2 కి.మీ) వరకు ఫోర్‌లైన్‌ ఉంది. ఒంగోలు నుంచి పొదిలికి మొత్తం 50 కి.మీ ఉండగా, దానిలో ఇప్పుడున్ను 8.2 కి.మీ ఫోర్‌లైన్‌ తీసేస్తే.. మిగిలిన 42 కి.మీ మాత్రమే నిర్మించనున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. ఇప్పటి వరకు రూ.3.50 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా.. జిల్లాలోని ఒకేఒక ఫోర్‌లైన్‌కు నిధులు కేటాయించలేకపోవడం శోచనీయమని ప్రభుత్వ వైఖరిని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. చివరకు సగానికి కుదించడం ఏంటో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చీమకుర్తి బైపాస్‌పై రాజకీయ ఒత్తిళ్లు...

ఫోర్‌లైన్‌ నిర్మాణంలో భాగంగా సంతనూతలపాడు, చీమకుర్తి, పొదిలి పట్టణాలకు వెలుపల బైపాస్‌లు నిర్మించాల్సి ఉంది. అయితే, చీమకుర్తిలో ఇప్పటికే సాగర్‌ కాలువ ఉత్తరం వైపు కట్టపై డబుల్‌ లైన్‌తో బైపాస్‌ ఉంది. దాన్నే ఫోర్‌లైన్‌గా మార్చేలా ఆర్‌అండ్‌బీ అధికారులు డీపీఆర్‌లో పొందుపరిచారు. ఇప్పుడున్న బైపాస్‌ను ఆనుకునే ఫోర్‌లైన్‌ నిర్మిస్తే పీపీపీ పద్ధతిలో కాంట్రాక్టర్‌కు, ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని అధికారుల అంచనా కాగా, సాగర్‌ కాలువకు దక్షిణంవైపున్న రెండో కట్ట మీద నిర్మిస్తే ఆ కట్టవైపున్న పొలాలకు మంచి గిరాకీ వస్తుందని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అధికార పార్టీ నాయకులంతా స్థానిక ప్రజాప్రతినిధి ద్వారా ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న బైపాస్‌ను ఆనుకుని నిర్మిస్తే రోడ్డుకు ఆనుకుని ఉన్న పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు ఫోర్‌లైన్‌ విస్తరణలో పోయే ప్రమాదం ఉందని, వాటిని రక్షించినట్లు అవుతుందనే ఉద్దేశంతో పాటు రెండోవైపు నిర్మిస్తే.. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం అభివృద్ధి చేసుకునేందుకు వీలుంటుందని ఎవరికి నచ్చిన డ్రామాలు వారు ఆడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు మాత్రం ఇప్పుడున్న బైపాస్‌ను ఆనుకుని మాత్రమే ఫోర్‌లైన్‌ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం డీపీఆర్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంటుందంటున్నారు.

వేలాది వాహనాల రాకపోకలకు

తీవ్ర ఇబ్బందులు...

చీమకుర్తిలోని గ్రానైట్‌ లారీలు, కంకర టిప్పర్లతో పాటు ఇతర వాహనాలు వేలాదిగా చీమకుర్తి నుంచి ఒంగోలు వైపు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. 50 టన్నుల నుంచి దాదాపు 100 టన్నుల సామర్థ్యంతో గ్రానైట్‌ రాళ్ల ట్రాలీలు రాకపోకల కారణంగా రోడ్లు, కల్వర్టులు ఛిద్రమవుతున్నాయి. వాహనాల సామర్థ్యానికి తగినట్లుగా రోడ్లు, కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా ఆర్‌అండ్‌బీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పొదిలి వరకే

ఫోర్‌లైన్‌ నిర్మాణం

గతంలో ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు ఫోర్‌లైన్‌ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. కానీ, ఇప్పుడు తయారు చేసిన డీపీఆర్‌ ప్రకారం ఒంగోలు నుంచి 8.2 కి.మీ.. అంటే సంతనూతలపాడు ట్రిపుల్‌ ఐటీ కాలేజీ నుంచి పొదిలి వరకు మాత్రమే ఫోర్‌లైన్‌ నిర్మాణం చేపట్టేందుకు డీపీఆర్‌ తయారు చేశారు. ప్రభుత్వానికి డీపీఆర్‌ పంపించాం. చీమకుర్తి బైపాస్‌లో ఇప్పుడున్న రోడ్డును ఆనుకునే ఫోర్‌లైన్‌ విస్తరణ ఉంటుంది.

– రాంనాయక్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ

సాగర్‌ కాలువ రెండో కట్టపై ఫోర్‌లైన్‌ నిర్మిస్తేనే చీమకుర్తి అభివృద్ధి

చీమకుర్తి బైపాస్‌ను ఆనుకుని పెద్ద పెద్ద భవనాలు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. వాటికి ఇబ్బంది లేకుండా సాగర్‌ కాలువ రెండో కట్టవైపు ఫోర్‌లైన్‌ నిర్మిస్తే అటువైపు కూడా చీమకుర్తి పట్టణం అభివృద్ధి చెందుతుంది.

– కుంచాల రాంబాబు, చీమకుర్తి

ప్రస్తుతం ఉన్న డబుల్‌ లైన్‌ రోడ్డు ఇరుకుగా ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కర్నూలు రోడ్డుపై రామతీర్థం వద్ద రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి దారుణంగా మరణించాడు. చీమకుర్తి–సంతనూతలపాడు సరిహద్దులో ఎర్రగుడిపాడు, మర్రిచెట్లపాలెం వంటి పలు ప్రధాన ప్రాంతాల్లో వారానికి రెండు మూడు ప్రమాదాలు జరుగుతూ నెలకు ఐదారుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ కేంద్రం శివారులోని కర్నూలు రోడ్డులో కల్వర్టుకు పెద్ద రంధ్రం పడి వాహనాల రాకపోకలకు రాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్టుపై ట్రాఫిక్‌ నియంత్రణ బోర్డును బోర్లించి ఆర్‌అండ్‌బీ అధికారులు చేతుల దులుపుకున్నారు. కల్వర్టుకు పడిన రంధ్రాన్ని పూడ్చలేదు. కల్వర్టుకు పక్కగా రోడ్డు వేయలేదు. అదే విధంగా సంతనూతలపాడులోని ట్రిపుల్‌ ఐటీ కాలేజీ వద్ద రోడ్డు సగం తెగిపోవడంతో మొదట సిమెంట్‌ పైపులతో మరమ్మతులు చేసినా ఫలితం లేకపోవడంతో మరోసారి మరమ్మతులు చేశారు.

ప్రమాదకరంగా మారిన సంతనూతలపాడు కల్వర్టు

(రెడ్‌ సర్కిల్లో నెలల తరబడి రంధ్రం పడిన ప్రాంతం)

సంతనూతలపాడు ట్రిపుల్‌ ఐటీ వద్ద ఇప్పటికే రెండు సార్లు మరమ్మతులు చేసిన ప్రాంతం (రెడ్‌ సర్కిల్‌లో)

నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పొడవును కుదించడంపై తీవ్ర విమర్శలు

తొలుత ఒంగోలు నుంచి బేస్తవారిపేట వరకు 113 కి.మీ పొడవున విస్తరించేందుకు చర్యలు

ప్రస్తుతం ఒంగోలు నుంచి పొదిలి వరకు 42 కి.మీ మాత్రమే విస్తరించేందుకు ఏర్పాట్లు

పొదిలి నుంచి రెండు లైన్లకే పరిమితం చేస్తూ ప్రభుత్వానికి అధికారుల డీపీఆర్‌

చీమకుర్తి బైపాస్‌ను ఆనుకునే ఫోర్‌లైన్‌ విస్తరణ

సాగర్‌ కాలువ రెండో కట్ట వైపునకు మార్చేందుకు స్థానిక నాయకుల రాజకీయ ఒత్తిళ్లు

Advertisement
 
Advertisement
Advertisement